నిజం.. ఓటేయటానికి సభకు వచ్చిన పాజిటివ్ ఎమ్మెల్యే

Update: 2020-06-19 10:50 GMT
దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఊహకు అందని రీతిలో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు స్ట్రెచర్ మీద సభకు వచ్చి ఓటు వేసి వెళితే.. తాజాగా మధ్యప్రదేశ్ లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో అందుకు భిన్నమైన సీన్ ఒకటి కనిపించింది.

రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావటంతో.. తాజాగా పాజిటివ్ గా వెల్లడై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సభకు రావటంతో ఆసక్తికరంగా మారింది. కరోనా పాజిటివ్ గా ఉన్న ఎమ్మెల్యే పీపీఈ ఫుల్ సూట్ తో.. పూర్తి రక్షణాత్మకంగా డ్రెస్ అయి సభకు వచ్చారు. పాజిటివ్ లక్షణాలతో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సభకు రావటంతో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.

ఆయనకు తోడుగా మరొక సహాయకుడు కూడా అసెంబ్లీకి వచ్చారు. మధ్యప్రదేశ్ లో జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి స్థానం చాలా కీలకమైంది. దీంతో.. తమకు వచ్చే స్థానాన్ని సొంతం చేసుకోవటం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ రీతిలో రావాల్సి వచ్చింది.

పాజిటివ్ లక్షణాలున్న ఎమ్మెల్యే సభకు రావటంతో.. ఆయనకు సమీపంలో ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. సాధారణంగా క్వారంటైన్ లో ఉన్న వారిని సైతం కలుసుకోనివ్వటానికి ఒప్పుకోరు. కానీ.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయటం కోసం ఏకంగా పాజిటివ్ పేషెంట్ ను తీసుకురావటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా.. ప్రజాస్వామ్య దేశంలో కొన్ని అంశాల్లో అందరూ ఒకటే అని చెప్పినా.. సమానుల్లో ప్రధములుగా రాజకీయ నేతలు ఉంటారనటానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News