అమ్మ హెల్త్ పిటీష‌న్ల‌పై హైకోర్టు ఆక్షింత‌లు

Update: 2016-10-06 10:23 GMT
రెండు వారాల‌కు పైగా త‌మిళుల్ని తీవ్ర ఆందోళ‌న‌ల్లో ముంచెత్తి.. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌గా మారిన త‌మిళ‌నాడు రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆరోగ్యానికి సంబంధించి దాఖ‌లైన పిటీష‌న్ల‌పై మ‌ద్రాస్ హైకోర్టు రియాక్ట్ అయ్యింది. ఆమె ఆరోగ్యంపై ప‌లుసందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని.. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వివ‌రాలు.. ఫోటోలు ప్ర‌జ‌ల‌కు విడుద‌ల చేయాల‌ని కోరుతూ పిటీష‌న్లు దాఖ‌లు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈ వ్య‌వ‌హారంపై వివ‌రాలు అందించాలంటూ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ఈ రోజు ఉద‌యం.. ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. కేవ‌లం రెండు.. మూడు నిమిషాల మాత్ర‌మే వాద‌న‌లు విన్న కోర్టు.. అమ్మ ఆరోగ్యంపై వేసిన పిటీష‌న్ వేసిన వారిపై అక్షింత‌లు వేసింది. చికిత్స ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేర‌ని.. ఈ పిటీష‌న్లు ప‌బ్లిక్ ఇంట్ర‌స్ట్ కంటే కూడా పొలిటిక‌ల్ ప‌బ్లిసిటీ ఇంట్ర‌స్ట్ లా ఉన్నాయ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.

పిటీష‌న్లో కోరిన‌ట్లుగా అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన వివ‌రాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్న కోర్టు.. ఫోటోలు విడుద‌ల చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ సంద‌ర్భంగా అమ్మ ఆరోగ్యంపై వేసిన పిటీష‌న్ల‌ను ఉటంకిస్తూ.. కోర్టు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. జ‌య‌ల‌లిత ఆరోగ్యాన్ని రాజ‌కీయాల కోసం వాడుకోవ‌ద్దంటూ సూచించింది. ట్రాఫిక్ రామ‌స్వామి వేసిన పిటీష‌న్ పై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? ప‌్ర‌భుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? అని ఆస‌క్తిగా చూసిన వారికి మ‌ద్రాస్ హైకోర్టు తీర్పు ఒక్క విష‌యాన్ని స్ప‌ష్టం చేసింద‌ని చెప్పుకోవాలి. ఒక మ‌నిషి అనారోగ్యంతో బాధ ప‌డుతున్న వేళ‌.. ఆ విష‌యాన్ని రాజ‌కీయం కోసం వాడుకోవ‌టం ఏమాత్రం స‌బ‌బు కాద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News