ఫ్లెక్సీలు.. బ్యాన‌ర్ల‌పై మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క తీర్పు

Update: 2017-10-25 07:13 GMT
గ‌తంలో ఓ బ్యాన‌ర్ ఏర్పాటు చేయాలంటే త‌తంగం చాలానే ఉండేది. ఆర్టిస్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఆయ‌న చేత బ్యాన‌ర్ రాయించుకొని.. త‌గిలించేస‌రికి కాస్త టైం ప‌ట్టేది.. ఖ‌ర్చు కూడా భారీగా ఉండేది. టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఆ మ‌ధ్య‌న మొద‌లైన డిజిట‌ల్ ప్రింటింగ్ దెబ్బ‌కు మొత్తం వ్య‌వ‌స్థే మారిపోయింది. కంటెంట్ రెఢీగా ఉండాలంటే గంట‌ల్లోనే భారీ ఫ్లెక్సీ.. హోర్డింగ్‌.. బ్యాన‌ర్ ఇలా ఏది కావాలంటే అది సిద్ధ‌మైపోతోంది.. అది కూడా చౌక‌గానే.

దీంతో.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా చిన్న కార్య‌క్ర‌మానికైనా భారీ ఫ్లెక్సీలు ప్రింట్ చేసి వీధుల్లో భారీగా ఏర్పాటు చేయ‌టం ఎక్కువైంది. ఇక‌.. రాజ‌కీయ నేత‌ల హ‌డావుడి అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇలా.. ఫ్లెక్సీల హోరుతో బ‌జార్లు మొత్తం ప్ర‌క‌ట‌న‌లమ‌యం అయిపోతున్నాయి. అడుగుకో ఫ్లెక్సీ.. బ్యాన‌ర్ క‌నిపించేస్తున్నాయి. వీటితో ప‌ర్యావ‌ర‌ణానికే కాదు.. వీధుల‌న్నీ ఫ్లెక్సీల‌తో నిండిపోతున్నాయి. ఇలాంటివేళ మ‌ద్రాస్ హైకోర్టు ఆస‌క్తిక‌ర తీర్పును వెల్ల‌డించింది.

దీని ప్ర‌కారం.. ఇక‌పై ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు కావొచ్చు.. బ్యాన‌ర్లు కావొచ్చు.. ఇంకే రూపంలో అయినా స‌రే.. చ‌నిపోయిన వారి ఫోటోలు త‌ప్పించి బ‌తికి ఉన్నోళ్ల ఫోటోలు ప్రింట్ చేయ‌కూడ‌దంటూ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. బ‌తికున్న వారి ఫోటోలను బ్యాన‌ర్లు.. ఫ్లెక్సీల‌పై ప్రింట్ చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చెప్పింది.

మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మొద‌లు ప‌క్కింటోడి వ‌ర‌కూ ఎవ‌రైనా స‌రే చ‌నిపోయిన వారి ఫోటోలు త‌ప్పించి.. బ‌తికున్నోళ్ల ఫోటోలు ప‌బ్లిష్ చేయ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాష్ట్రంలో ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం కోసం గోడ మీద కూడా అన‌వ‌స‌ర‌మైన రాత‌లు రాయొద్ద‌ని పేర్కొంది. ఇంత‌కీ మ‌ద్రాస్ హైకోర్టు ఈ తీర్పు వెల్ల‌డించ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న ప్ర‌శ్న వేసుకుంటే ఆస‌క్తిక‌ర‌మైన ఉదంతం ఒక‌టి తెర మీద‌కు వ‌స్తుంది.

చెన్నై మ‌హాన‌గ‌రంలోని అరుంబ‌క‌మ్ ప్రాంతానికి చెందిన కుమారి అనే మ‌హిళ ఇంటి ముందు ఓ పార్టీ వారు భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ఆమె అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో స‌ద‌రు పార్టీ నేత‌లు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ కేసును విచారించిన కోర్టు బ్యాన‌ర్ల ఏర్పాటుపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. స్ప‌ష్ట‌మైన ఆదేశాల్ని జారీ చేసింది. అదే స‌మ‌యంలో కుమారి ఇంటి ముందు ఏర్పాటు చేసిన భారీ బ్యాన‌ర్‌ ను వెంట‌నే తొల‌గించాలంటూ స్థానిక పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఇక‌పై జ‌ర‌గ‌కుండా చూడాల‌ని కూడా పోలీసుల్ని కోరింది. మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ‌లు చేస్తే.. వీధుల‌న్నీ శుభ్రంగా.. ప్ర‌శాంతంగా ఉండ‌టం ఖాయం.
Tags:    

Similar News