ఇది తెలుగోడి అస‌లు విజ‌యం

Update: 2016-08-08 06:49 GMT
తెలుగువాళ్ల‌ను ఉద్దేశించి చెప్పే క‌థ‌ల్లో ఒక క‌థ‌ను త‌ర‌చూ చెబుతుంటారు. ఒక బుట్ట‌లో వేసిన క‌ప్పులు బుట్ట‌లో పైకి రావ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటే.. పైకెళ్లిన క‌ప్ప‌ను కింద‌నున్న క‌ప్పులు ప‌ట్టుకొని లాగేస్తాయ‌ని.. ఏ క‌ప్పను పైకి వెళ్ల‌కుండా చేస్తాయ‌ని ఎట‌కారం చేస్తూ.. తెలుగోళ్ల‌లో ఐక‌మత్యం ఎంత త‌క్కువ‌న్న విష‌యాన్ని పిట్ట‌క‌థ రూపంలో చెబుతుంటారు. అందుకేనేమో.. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నా.. వారికంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌టంలోమాత్రం ఎప్పుడూ వెనుక‌బ‌డే ఉంటారు.

ఇద్ద‌రు త‌మిళులు క‌లిస్తే.. త‌మిళంలో మాట్లాడుకుంటారు. ఇద్ద‌రు మ‌ల‌యాళీలుక‌లిస్తే మ‌ల‌యాళంలో మాట్లాడుకుంటారు.కానీ.. ఇద్ద‌రు తెలుగోళ్లు క‌లిస్తేమాత్ర‌మే ఇంగ్లిషులో మాట్లాడుకుంటార‌న్న ఫిర్యాదు కూడా ఉంది. భాష మీద అభిమానం పెద్ద‌గా లేద‌న్న ఫిర్యాదు ఉన్న తెలుగోళ్ల మ‌ధ్య త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. అందుకేనేమో.. ప్రాచీన‌భాష అయిన‌ప్ప‌టికీ తెలుగుకు ఇప్ప‌టికీ ఆ హోదా తెచ్చుకోవ‌టంలో వెనుక‌బ‌డిపోయి.. కోర్టుల చుట్టూ తిరిగే ప‌రిస్థితి. తెలుగు ప్రాచీన భాషగా ప‌రిగ‌ణించొచ్చా? లేదా? అన్న అంశంపై మ‌ద్రాస్ హైకోర్టులో ఒక వాజ్యం న‌డుస్తోంది. తాజాగా కోర్టు త‌న తీర్పును ఇచ్చింది. తాజా తీర్పు ప్ర‌కారం తెలుగు భాష ప్రాచీన భాషే అన‌టానికి ఎలాంటి సందేహం అక్క‌ర్లేద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది.

తెలుగు ప్రాచీన భాష కాదంటూ దాఖ‌లైన పిటీష‌న్ ను  కొట్టేసిన మ‌ద్రాస్ హైకోర్టు.. తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వ‌టానికి అవ‌స‌ర‌మైన అన్నిఅర్హ‌త‌లూ ఉన్నాయ‌ని.. వాటిన్నింటిని ప‌రిశీలించిన మీద‌టే.. నిబంధ‌న‌ల ప్ర‌కారం హోదా ద‌క్కిందంటూ జ‌డ్జి పేర్కొన‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో తెలుగోళ్లు చేసిన త‌ప్పుల కార‌ణంగా.. తెలుగు అన్న వెంట‌నే మ‌ద్రాసీ అంటూ చుల‌క‌న‌గా మాట్లాడే వేళ‌.. తెలుగును ప్రాచీన భాష‌గా ఎలా గుర్తిస్తారంటూ త‌మిళ‌నాడుకు చెందిన ఒక వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం తెలుగు ప్రాచీన భాష‌గా గుర్తిస్తూ తాజాగా తీర్పు వెలువ‌రించింది. తాజా తీర్పుతో తెలుగుకు ప్రాచీన హోదా ద‌క్క‌టంతోపాటు.. రూ.100 కోట్ల మేర నిదులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నిధుల‌తో తెలుగు భాష‌ను మ‌రింత ప‌రిపుష్టం చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఉంది.ఇది..నిజంగా తెలుగోళ్ల అస‌లుసిస‌లు విజ‌యంగా చెప్పాలి.
Tags:    

Similar News