వాహనదారులకు మద్రాస్ హైకోర్టు కొత్తరూల్

Update: 2015-09-23 11:41 GMT
ద్విచక్ర వాహనం వినియోగించే వారికి సంబంధించి ఒక్క హెల్మెట్ తప్పనిసరి అన్న నిబంధనను పక్కాగా అమలు చేసే విషయంలో కిందామీదా పడుతుంటే.. తాజాగా మద్రాస్ హైకోర్టు సరికొత్త తీర్పు ఇచ్చేసింది. తాజాగా ఇచ్చిన తీర్పు అటు వాహనదారులే కాదు.. వాహన తయారీ కంపెనీలకు సైతం కొత్త ఇబ్బందిని తెచ్చి పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరి చేయాలన్న అంశంపై మరో మాట లేదనేసిన మద్రాస్ హైకోర్టు.. వాహనం నడిపే వారు మాత్రమే కాదు.. వెనుక కూర్చున్న వారికి సైతం హెల్మెట్ ఉండాల్సిందేనని తేల్చింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన వారికి రెండు కొత్త హెల్మెట్లు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో.. వాహనదారులు ఒకరైనా.. హెల్మెట్లు మాత్రం రెండు కొనాల్సిన పరిస్థితి. అంతేకాదు.. వాహనానికి హెల్మెట్ ను లాక్ చేసేలా వాహనానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా వాహన కంపెనీలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది.

వాహనానికి హెల్మెట్లు పెట్టుకోవటానికి వీలుగా ఏర్పాట్లు వాహన ఉత్పత్తిదారులు చేపట్టాలని.. దాన్ని ఎగ్రస్ట్రా ఫిట్టింగ్ గా ఉంచకూడదని.. దాని కోసం అదనంగా చార్జీలు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒక్క హెల్మెట్ వినయోగం విషయంలోనే కిందామీదా పడుతున్న వారికి.. ఇప్పుడు రెండు హెల్మెట్ల కాన్సెప్ట్ ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందన్నది ఒక వాదన అయితే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని వాహన కంపెనీలు ఎంతవరకు అమలు చేస్తాయన్నది మరో ప్రశ్న అని చెబుతున్నారు.
Tags:    

Similar News