రజనీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా?

Update: 2016-01-30 04:20 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ కు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి తప్పదా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సిందే. ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆయనకు.. ఆయన సతీమణి లతా రజనీకాంత్ కు మద్రాస్ హైకోర్టు సమన్లు పంపింది. చెన్నైలోని గిండి.. రేస్ కోర్స్ ప్రాంతంలోని స్కూల్ స్థల వివాదంలో భాగంగా రజనీ దంపతులు మద్రాస్ హైకోర్టు గడప తొక్కక తప్పని పరిస్థితి.

గిండిలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ పాఠశాలకు సంబంధించిన స్థల వివాదం నడుస్తోంది. దాదాపు కొంత కాలంగా నడుస్తున్న ఈ వివాదానికి సంబంధించి రజనీకాంత్ దంపతులు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే.. కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వుల్లో ఉన్న రజనీకాంత్ పేరును మినహాయించాలని స్కూల్ ప్రిన్సిపల్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. రజనీకాంత్ దంపతులు న్యాయస్థానం ఎదుట హాజరు కావాల్సిందేనని.. ఎలాంటి మినహాయంపులు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

కావాలంటే.. రెండు వారాల గడువు ఇస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో.. ఈ కేసు వ్యవహారంలో రజనీకాంత్.. ఆయన సతీమణి లతా రజనీకాంత్ మద్రాస్ హైకోర్టు ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సూపర్ స్టార్ ను కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా  ఉండేలా స్కూల్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. మరి.. ఈ ప్రయత్నంలో స్కూల్ నిర్వాహకులు ఎంత వరకు సఫలమవుతారో చూడాలి.
Tags:    

Similar News