స్నాప్‌ డీల్‌ లో మ్యాగీ

Update: 2015-11-10 22:30 GMT
ఐదునెల‌ల త‌ర్వాత ఎట్టకేలకు మ్యాగీ నూడుల్స్ మళ్లీ రిటైల్ మార్కెట్ లో ప్రత్యక్షమయ్యాయి. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌ స్టంట్ నూడుల్స్ మ్యాగీని మళ్లీ ఐదు నెలల తర్వాత ఎంపిక చేసిన మార్కెట్ల ద్వారా సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. ఈ ద‌ఫా మార్కెట్ ల‌లో ఆన్‌ లైన్‌ లో  కూడా అందుబాటులో ఉండ‌నున్నాయి. మ్యాగీ నూడుల్స్‌ లో సీసం - ఇతర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశంలోని పలు రాష్ర్టాలు ఈ ఉత్పత్తులను నిషేధించాయి. ఇప్పటికీ ఎనిమిది రాష్ర్టాలు నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఈ నేప‌థ్యంలో ఎంపిక చేసిన రాష్ర్టాల్లోనే మ్యాగీని అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా 100 పట్టణాల్లో మళ్లీ మ్యాగీని ప్రవేశపెట్టినట్లు, ఇందుకోసం 300 ప్రత్యేక డిస్ర్టిబ్యూటర్లను ఏర్పాటు చేశామ‌ని  నెస్లే ఇండియా చైర్మన్ - మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ నారాయణన్ తెలిపారు. వచ్చే కొద్దిరోజుల్లో మరిన్ని పట్టణాల్లో సైతం విడుదల చేయనున్నట్లు చెప్పారు.

జరిగిపోయినదాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇకనుంచి మ్యాగీని మరిన్ని నగరాలకు విస్తరించడంపై సంస్థ దృష్టి సారించినట్లు  ఆయ‌న చెప్పారు. 32 ఏళ్లుగా మ్యాగీని ఇష్టపడుతున్న వినియోగదారులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కంటెంట్‌ను మార్చే ఉద్దేశమేది సంస్థకు లేదని, కానీ ప్యాకేజ్‌ను మాత్రమే మార్చాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మ‌రోవైపు ఇక‌నుంచి మ్యాగీ నూడుల్స్ ఆన్‌లైన్‌లోనూ లభ్యం కానున్నాయి. ఇందుకోసం సంస్థ ఆన్‌ లైన్ దిగ్గజం స్నాప్‌ డీల్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్లాష్ సేల్స్ పేరుతో ప్రారంభించిన స్కీం కింద మ్యాగీని కొనుగోలు చేయాలనుకునే రిటైలర్లు ముందస్తుగా తమ వివరాలను సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 12 నుంచి విక్రయాలను ప్రారంభించనున్నట్లు సురేశ్ తెలిపారు. నిషేధం విధించడంతో నెస్లే ఇండియా సుమారు రూ.530 కోట్లు నష్టపోయింది.
Tags:    

Similar News