తేల్చేసిన మాగుంట..టీడీపీకి ఆ సీట్లలో తలపోటు!

Update: 2019-03-08 10:34 GMT
తను అటు ఒంగోలు నుంచి అయినా, ఇటు నెల్లూరు నుంచి అయినా తెలుగుదేశం టికెట్ మీద ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా లేనట్టుగా తేల్చి చెప్పారట మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశంలో ఉంటారా.. వీడతారా..అనే అంశంపై చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతూ ఉన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే మాగుంటను వదులుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు.

ఆయన గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇలాంటి తరుణంలో.. ఇప్పుడు ఆయన పార్టీని వీడితే ఒంగోలులో టీడీపీ తరఫున అభ్యర్థి కూడా కష్టం అయ్యే పరిస్థితి ఉంది. ఒంగోలు ఎంపీ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని తేలిపోవడంతోనే మాగుంట అక్కడ నుంచి పోటీకి నో చెప్పారేమో అని.. ఆయనకు నెల్లూరు సీటు విషయంలో కూడా బాబు ఆఫర్ ఇచ్చారు. కావాలనుకుంటే  నెల్లూరు నుంచి పోటీ చేయవచ్చని కూడా ప్రతిపాదించారట. అయితే నెల్లూరు నుంచి పోటీకి కూడా మాగుంట ఇష్టత చూపడం లేదని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ నేఫథ్యంలో… శ్రీనివాసులు రెడ్డితో తెలుగుదేశం అధినేత సంప్రదింపులు జరిపారు. తాజాగా మాగుంట తుది నిర్ణయాన్ని చెప్పేశారట. తను నెల్లూరునుంచి అయినా ఒంగోలు నుంచి అయినా పోటీ చేసేందుకు నో.. అని ఆయన స్పష్టం చేశారట. దీంతో మాగుంట పై తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆశలు వదిలేసుకుంది.

ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే ఊహాగానాలకు కూడా ఇప్పుడు మరింత ఊపు వచ్చింది. అతి త్వరలో జగన్ ను కలిసి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం.
అదలా ఉంటే.. ఇప్పుడు  అటు  నెల్లూరు, ఇటు ఒంగోలు ఎంపీ సీట్లకు తెలుగుదేశం పార్టీ  అభ్యర్థి ఎవరనే అంశంపై గందరగోళం నెలకొంది.

ఒంగోలు నుంచి టీడీపీకి ఎంపీ సీటుకు తగిన అభ్యర్థి  లేరు. నెల్లూరు పరిస్థితి కూడా అలానే ఉంది. వీటిలో ఏదో ఒకటి మాగుంటకు  అనుకుంటే ఆయన తప్పించుకున్నారు. ఇక చేసేది లేక బీదమస్తాన్ రావు ను ఒంగోలు ఎంపీ బరిలో నిలపాలని బాబు అనుకుంటున్నారట. ఇప్పటికే ఆయన కు కావలి టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుగుదేశం చెబుతోంది. అయితే ఇప్పుడు ఆయనను ఒంగోలు నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారట చంద్రబాబు.

ఒంగోలుకు అభ్యర్తి లేకుండా పోయిన తరుణంలో బీదను అక్కడ పోటీ చేయించాలని అనుకుంటున్నారట. అయితే.. ఆయన దానికి సమ్మతిస్తారా? అనేది ఇంకా తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్న సీటుకు బీద మస్తాన్ రావు పోటీ చేసేందుకు సై అంటారా? లేదా? అనే అంశంపై ఇప్పుడు  చర్చ జరుగుతోంది. ఇక నెల్లూరు ఎంపీ సీటుకు అభ్యర్థిని తేల్చడం కూడా ఇప్పుడు బాబుకు తలపోటుగానే ఉంది!
Tags:    

Similar News