పీకేతో మాగుంట భేటీ!...ఏం జ‌రుగుతోంది?

Update: 2019-03-05 13:38 GMT
ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయం రంజుగా మారిపోతోంది. ఈ రోజు ఈ పార్టీలో ఉన్న నేత‌... రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహించ‌డం సాధ్యం కావ‌డం లేదు. రాజ‌కీయ నేత‌ల‌కు గెలుపే ల‌క్ష్యం. అంతకుమించి వారు ఏ అంశాన్ని అంత‌గా ప‌ట్టించుకోరు. త‌మ‌కు గెలుపు కావాలి. తాము ఉన్న పార్టీ అధికారంలోకి రావాలి. ఈ రెండు ప్రాతిప‌దిక‌ల మీదే రాజ‌కీయ నాయకులు లెక్క‌లేసుకుని మ‌రీ ముందుకు సాగుతుంటారు. ఈ లెక్క‌లేసుకున్న మీద‌టే... ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఎలాగూ గెల‌వ‌ద‌న్న భావ‌న‌తోనే ఆ పార్టీలోని కీల‌క నేత‌లు... గెలుపు అవ‌కాశాలు మెండుగా ఉన్న విప‌క్ష వైసీపీలోకి చేరిపోతున్నారు.  ఈ దిశ‌గానే ఆలోచిస్తున్న టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎమ్ ఎల్సి గా ఉన్న మాజీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి... వైసీపీలోకి చేరిపోతార‌ని చాలా కాలం నుంచే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే మాగుంట ఆశిస్తున్న ఒంగోలు పార్ల‌మెంటు - నెల్లూరు పార్ల‌మెంటు సీట్ల‌లో వైసీపీకి చెందిన కీల‌క నేత‌లు ఉన్నారు. వారిని త‌ప్పించ‌డం అంత ఈజీ కూడా కాద‌న్న వాద‌న లేక‌పోలేదు. అయితే మాగుంట వ‌స్తే... ఈ రెండు స్థానాల్లోని ఒక నేత‌ను ఎలాగైనా బుజ్జ‌గించేయాల‌ని కూడా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భావించిన‌ట్లుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇంకా టీడీపీలోనే కొన‌సాగుతున్న మాగుంట... వైసీపీలోకి చేరే విష‌యంపై అస్స‌లు నోరు విప్ప‌డం లేదు. ఇలాంటి కీల‌క త‌రుణంలో నేడు ఒంగోలులో ఓ కీల‌క భేటీ జ‌రిగింది. ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో మాగుంట భేటీ అయ్యార‌న్న వార్త‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని అటు మ‌ళ్లించేశాయి. జ‌న‌సేన ఎలాగూ గెలిచే ప‌రిస్థితి లేద‌న్న‌ది అంద‌రి వాద‌న‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఒంగోలు పార్ల‌మెంటు నుంచి బ‌రిలోకి దిగిన మాగుంట‌... వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఆర్థికంగా బ‌ల‌మైన నేత‌గా ఉన్న మాగుంట‌ను పార్టీలోనే నిలుపుకునేందుకు చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటిచ్చేశారు. దీంతో నిన్న‌టిదాకా సైలెంట్‌గానే ఉన్న మాగుంట‌... తాను ఈ ద‌ఫా పోటీ చేసే ఎంపీ సీటు ప‌రిధిలో ఎమ్మెల్యేల ఎంపిక‌లో త‌న మాట‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని చంద్ర‌బాబుకు సూచించారు.

అటు నుంచి ఏం స‌మాధానం వ‌చ్చిందో తెలియ‌దు గానీ... మాగుంట సైలెంట్ అయిపోయారు. తాజాగా ఆయ‌న ఒంగోలుకు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారిద్ద‌రూ ఏం మాట్లాడుకున్నార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఇటు టీడీపీలో త‌న మాట చెల్లక‌ - అటు వైసీపీ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌ని కార‌ణంగానే మాగుంట‌... జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని కొన్ని విశ్లేష‌ణ‌లు చెబుతున్నాయి. అయితే పీకే సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవితో మాగుంట‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయని, మెగాస్టార్ సోద‌రుడిగా ఒంగోలు వ‌చ్చిన ప‌వ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగానే మాగుంట క‌లిశార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకరు నోరిప్పితేనే.. అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్ప‌టిదాకా వెయిట్ చెయ్య‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News