బాబుకు షాక్‌.. జ‌గ‌న్ గూటికి మాగుంట‌!

Update: 2018-06-28 05:52 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు భారీ షాక్ ఒక‌టి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ సీనియ‌ర్ నేత‌.. ప్ర‌కాశం జిల్లా ఎమ్మెల్సీ మాగుంట శ్రీ‌నివాసుల రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెఢీ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినేత తానిచ్చిన హామీ మీద నిల‌వ‌క‌పోవ‌టం.. గ‌తంలో ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌టంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోక‌పోవ‌టంపై ఆగ్ర‌హంగా ఉన్న ఆయ‌న‌.. తాజాగా బాబుతో జ‌రిగిన భేటీలోనూ గ‌తంలో త‌న‌కిచ్చిన హామీ ప్ర‌స్తావన రాక‌పోవ‌టంపై గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. జ‌గ‌న్‌ పార్టీలో త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన బాలిరెడ్డితో ఇప్ప‌టికే పార్టీ మారే విష‌యం మీద మాగుంట చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీ స్థానానికి బ‌రిలో దిగిన మాగుంట‌ శ్రీ‌నివాసులు ఓట‌మి చెంద‌టం.. అనంత‌రం ఎమ్మెల్సీ అవ‌కాశాన్ని ఇచ్చిన చంద్ర‌బాబుకు ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికి తానిచ్చిన హామీని నెర‌వేర్చ‌ని బాబు తీరుపై మాగుంట సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తాజాగా జిల్లాల వారీగా పార్టీ రివ్యూలు చేస్తున్న చంద్ర‌బాబు.. ప్ర‌కాశం జిల్లా రివ్యూను చేయ‌టం.. ఈ సంద‌ర్భంలోనూ మాగుంట‌కు తానిచ్చిన హామీని నెర‌వేర్చ‌క‌పోవటంపై మాట వ‌ర‌స‌కు కూడా ప్ర‌స్తావించ‌లేద‌ని చెబుతున్నారు. ఈ తీరు ఆయ‌న్ను హ‌ర్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.  

మ‌రోవైపు మాగుంట పార్టీలోకి వ‌చ్చేందుకు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీ టికెట్‌ ను మాగుంట‌కు ఇచ్చేందుకు జ‌గ‌న్ ఓకే చేసిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైవీ సుబ్బారెడ్డి  ని సొంత నియోజకవర్గం నుండి ఎంఎల్  ఏ  గా బ‌రిలో నిల‌పాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. పాద‌యాత్ర‌కు పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ కూడా మాగుంట‌ పార్టీ మారటానికి కార‌ణంగా చెబుతున్నారు. ఓప‌క్క బాబుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతోన్న వేళ‌లో ఇప్పుడే పార్టీ మార‌టం మంచిద‌న్న ఆలోచ‌న‌లో మాగుంట ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రీ స‌మాచారం ఎంత నిజ‌మ‌న్న‌ది కాస్త వెయిట్ చేస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News