‘‘అయ్యోధ్య’’ వివాదంపై ఒక మంచి అడుగు పడింది

Update: 2016-06-01 07:30 GMT
రావణకాష్ఠంలా రగులుతున్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడటం (కొందరు దీన్ని రామజన్మభూమి అంటారు. మరికొందరు బాబ్రీ మసీదు అంటారు.కానీ.. అత్యున్నత న్యాయస్థానం మాత్రం దీన్ని వివాదాస్పద కట్టడంగా పేర్కొనాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ.. ఎవరికి వారు వారికి తోచినట్లుగా పేర్కొనటం ఒక అలవాటుగా మారింది) మీద ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక తప్పుడు రాజకీయ నిర్ణయం దేశంలో ఎంత కలకలాన్ని రేపుతుందనటానికి ఈ వివాదాస్పద కట్టడమే నిదర్శనంగా చెప్పొచ్చు. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ వివాదాన్ని చర్చలతో శాంతియుతంగా పరిష్కరించుకునే వీలున్నా.. రెండు వర్గాల వారు ఎవరికి వారు ఒక్క అడుగు వెనక్కి వేసేందుకు సిద్ధంగా లేకపోవటంతో అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశాన్ని ఏటూ తేల్చ లేకపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అయోధ్య వివాదానికి శాంతియుత పరిష్కారం వెతికే పనిలో భాగంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.

అఖిల భారత అభార పరిషత్తు నూతన అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఇతర మహంతులు.. సాధువులతో కలిసి వివాదాస్పద కట్టడం కేసులో చాలాకాలంగా కక్షిదారుగా ఉన్న హసీమ్ అన్సారీతో అరగంట పాటు సమావేశం అయ్యారు. రెండు పక్షాల వారికి సంతృప్తికరంగా ఉండే పరిష్కారం కోసం చర్చలు జరపాలని వారు భావిస్తున్నట్లుగా గిరి వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంలో కీలకమైన అన్సారీ మాట్లాడుతూ చర్చల ద్వారా పరిష్కారం వెతికేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉభయులు ఆనందంగా ఉండేలా పరిష్కారాన్ని వెతకటం బాగుంటుందన్న మాట ఇరువురి నోట రావటం శుభ పరిణామంగా చెప్పాలి. మరి.. మాటల్లో కనిపించినంత సానుకూలత చర్చల్లో కూడా ఉంటే మంచిది.
Tags:    

Similar News