సేన్ చీఫ్ కు షాకింగ్ వార్నింగ్ ఇచ్చేసిన సీఎం షిండే

Update: 2022-07-31 05:43 GMT
మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తమకు దక్కనిది ఎవరికి దక్కకూడదన్న కాన్సెప్టు కు కాస్త భిన్నంగా.. తమకు దక్కాల్సింది ఎవరికి దక్కిందో వారికి దక్కకుండా చేయటంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనటానికి నిదర్శనంగా మహారాష్ట్ర లోని రాజకీయ పరిణామాలే నిదర్శనమని చెప్పొచ్చు. అధికార శివసేన పార్టీని చీల్చి.. అందులోని రెబల్ వర్గానికి తాము మద్దతు ఇవ్వటం ద్వారా ఉద్దవ్ ను సీఎం కుర్చీ నుంచి దించేశారు కమలనాథులు. అనూహ్యంగా ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకున్న ఏక్ నాథ్ షిండే.. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అగ్రెసివ్ గా వ్యవహరిస్తున్నారు.

థాక్రే ద్రోహులుగా షిండే అండ్ కోను శివసేన ఘాటు విమర్శలు చేస్తున్న వేళ.. ఏక్ నాథ్ షిండే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇన్ డైరెక్టు వార్నింగులు ఇవ్వటం గమనార్హం. తాను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందన్న ఆయన.. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి.. తర్వాత ఎన్సీపీతోనూ.. కాంగ్రెస్ తోనూ ఎలా చేతులు కలిపారు? అని ప్రశ్నించారు.

ఇలాంటి ప్రశ్నలు రాజకీయాల్లో మామూలే అయినా.. ఎవరూ ఊహించని ఒక అంశాన్ని ప్రస్తావించటం ద్వారా.. షిండే తలుచుకుంటే సేనలో 'భూకంపం' ఖాయమన్న భావన కలిగేలా చేశారు. 2002లో శివసేనకు చెందిన ఫైర్ బ్రాండ్ నేత ఆనంద్ దిఘే రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాజాగా షిండే మాట్లాడుతూ.. తన గురువు ఆనంద్ దిఘే విషయంలో ఏం జరిగిందో తనకు తెలుసనని.. తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పటం ద్వారా.. కొత్త చర్చకు తెర తీశారు.

నిజానికి తామే అసలు సిసలు బాలాసాహెబ్ థాక్రే వారసులుగా అభివర్ణించుకున్నారు. ఇందుకు బలం చేకూరేలా సాహెబ్ కోడలు.. మనమడు కూడా తమకే మద్దతుగా నిలిచిన వైనాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి మరోసారి అధికారాన్ని చేపడతామని షిండే ధీమా వ్యక్తం చేశారు. తన భూకంపం మాటతో మహారాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించిన షిండే.. మరిన్నిసార్లు రాజకీయ సంచలనంగా మారతారన్నమాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News