అవార్డ్ వాప‌సీ...ఇపుడు రైతుల వంతు!

Update: 2016-02-22 11:03 GMT
దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ గతంలో కొంతమంది కళాకారులు, రచయితలు తమ అవార్డులను వాపస్ ఇచ్చారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా పెను దుమారమే రేగిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డింది. అయితే అవార్డు వాప‌సీ వ‌రుసలో తాజాగా రైతులు చేరారు. మహారాష్ట్ర రైతులు ఎంచుకున్న ఈ నిర‌స‌న విధానం మాత్రం వారి స‌మ‌స్య‌ల కోస‌మే కాకుండా జాతి క్షేమం కోసం కావ‌డం ఆస‌క్తిక‌రం.

కరువు పీడిత ప్రాంతాల్లో ఉన్న‌ తమను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వానికి నిరసనగా  అవార్డ్ వాపసీ ఉద్యమానికి  మ‌హారాష్ట్ర రైతులు సిద్ధమయ్యారు. సాగులో చూపించిన ప్రతిభకు గాను 1983లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ రైతు  పురస్కారాన్ని అందుకున్న జల్నా ప్రాంతానికి చెందిన నారాయన్ ఖడ్కే(78)  అనే రైతు  కొద్ది రోజుల క్రితం తన అవార్డును తిరిగిచ్చాడు. లాతుర్ జిల్లాలోని కర్లకు చెందిన మరోరైతు విఠల్ రావ్ కాలే కూడా అవార్డుతో పాటు తనకు లభించిన 10 వేల నగదును కూడా సీఎం సహాయ నిధికి తిరిగి ఇచ్చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ అమలులో మాత్ర చిత్తశుద్ధిని చూపించడం లేదని ఆరోపిస్తున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రమైన మ‌హారాష్ట్రలో వాణిజ్య రాజ‌ధాని ముంబై సమీపంలో కొన్ని ప్రాంతాలు త‌ప్ప మిగ‌తా జిల్లాల‌న్నింటిలోనూ క‌రువు తాండ‌విస్తోంది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో రైతులు అల్లాడిపోతున్నారు. ప్ర‌ముఖ సినీన‌టుడు నానా ప‌టేక‌ర్ సైతం కొద్దికాలం క్రితం త‌న ట్ర‌స్ట్ ద్వారా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతు కుటుంబాల‌కు కొంత ఆర్థిక సహాయం అంద‌జేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News