ఎక్స్ ట్రా చేసిన ఎమ్మెల్యే .. గవర్నర్ గుర్రు !

Update: 2019-12-31 05:38 GMT
ఎమ్మెల్యే , ఎంపీ , ప్రతిపక్ష నేతలు , ముఖ్యమంత్రి , ప్రధానమంత్రి ...ఎలా ఎవరైనా కూడా రాజ్యాంగానికి అతీతులు కారు. కాబట్టి ఎవరైనా కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. కానీ , అప్పుడప్పుడు కొంతమంది తమ సొంత తెలివి తేటలు ఉపయోగిస్తుంటారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలో కూడా మరొకరు చెప్పాలి అంటే అంత కంటే మరో దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా. కానీ , ఇప్పుడు కూడా అలాంటి వారు కొందరు ఉన్నారు. తాజాగా ఒక ఎమ్మెల్యే ..స్వయంగా రాష్ట్ర గవర్నర్ ముందే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండటంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలో తాజాగా కేబినెట్‌ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌, శివసేన నేత ఆదిత్య ఠాక్రే సహా 36 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ముంబయిలోని రాష్ట్ర విధాన్‌ భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ కొత్త మంత్రుల తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయం లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేసీ పాడ్వీ ప్రొటోకాల్‌ కు విరుద్ధంగా అదనపు వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అది విన్న గవర్నర్‌ కోశ్యారీ కేసీ పాడ్వీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకారం చేసే సమయం లో ప్రొటోకాల్‌ కు అనుగుణంగా వ్యవహరించడం తప్పనిసరి అని ముందు వరుసలో కూర్చున్న సీనియర్‌ రాజకీయ నేతలు మీకు చెప్పి ఉండాల్సింది అని గవర్నర్‌ మందలించారు. దీంతో వెంటనే సీనియర్‌ నేతలు జోక్యం చేసుకుని ప్రొటోకాల్‌ను అనుసరించాలని పాడ్వీకి సూచించారు. అనంతరం పాడ్వీ రెండోసారి ప్రమాణం చేశారు.


Tags:    

Similar News