మ‌హా మ‌లుపులు తిరుగుతున్న మ‌హారాష్ట్ర రాజ‌కీయం!

Update: 2022-06-29 08:56 GMT
మ‌హారాష్ట్ర రాజ‌కీయం మ‌హా మ‌లుపులు తిరుగుతోంది. జూన్ 30న గురువారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవ్వాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. దీంతో శివ‌సేన కూడా అంతే వేగంగా పావులు క‌దుపుతోంది. విశ్వాస ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నుంది. ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

ఏక‌నాథ షిండే నాయ‌క‌త్వంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వీరంతా అసోంలోని గౌహ‌తిలో ఉన్నారు. ఈ 40 మందిలో 9 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఈ 40 మందికి తోడుగా 10 మంది స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు కూడా అసోంలోని గౌహ‌తిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ మంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్ మ‌హ‌రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారీని క‌ల‌సి శివ‌సేన ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు లేద‌ని.. బ‌ల‌ప‌రీక్ష‌కు ఆదేశించాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ కోషియారీ ఉద్ధ‌వ్ ప్ర‌భుత్వానికి జూన్ 30 వ‌ర‌కు చాన్సు ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం 5 గంట‌ల్లోపు మెజారిటీని నిరూపించుకోవాల‌ని కోరారు. దీంతో శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్ట‌నుంది. రేపటి బలపరీక్షను వాయిదా వేయలాని సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేయనుంది. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల నేప‌థ్యంలో ఇంత అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని శివసేన అభిప్రాయ‌ప‌డుతోంద‌ని తెలుస్తోంది.

కాగా శివ‌సేన పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు శివ‌సేన నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఎందుకు మీపై అనర్హత వేటు వేయ‌కూడ‌దో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. దీంతో ఆ 16 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జూలై 11 వ‌ర‌కు వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ డిప్యూటీ స్పీక‌ర్ ను ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ విష‌యం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంద‌ని.. ఇంత‌లో గ‌వ‌ర్న‌ర్ బ‌ల‌ప‌రీక్ష‌కు ఆదేశించ‌డం స‌రికాద‌ని శివ‌సేన అంటోంది.

రాజ‌కీయాలు వేడెక్కిన నేప‌థ్యంలో ఎన్సీపీ అధినేత‌, మాజీ సీఎం శరద్ పవార్‌ మహారాష్ట్ర మంత్రులతో భేటీ అయ్యారు. దీంతోపాటు సీఎం ఉద్ధవ్ థాక్రేతో ఆయ‌న‌ ఫోన్లో సంభాషించారు. జూన్ 30న జ‌ర‌గ‌బోయే విశ్వాస ప‌రీక్ష‌కు సంబంధించి వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు గవర్నర్ నిర్ణయంపై న్యాయ నిపుణులతో సైతం సీఎం ఉద్ధవ్ చర్చిస్తున్నారు.

కాగా అసోంలో రెబ‌ల్ నేత ఏక‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలంతా గోవా చేరుకుంటార‌ని తెలుస్తోంది. విశ్వాస ప‌రీక్ష నేప‌థ్యంలో అందుబాటులో ఉండ‌టానికి బీజేపీ వారిని గోవా త‌ర‌లిస్తోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే గోవాలోని తాజ్ రిసార్టులో 70 గ‌దులు బుక్ చేశార‌ని అంటున్నారు. జూన్ 30 ఉద‌యం రెబ‌ల్ ఎమ్మెల్యేలంతా గోవా నుంచి ముంబై వ‌స్తార‌ని స‌మాచారం.
Tags:    

Similar News