రిజర్వేషన్ కలకలాన్ని రేపిన ఉద్దవ్

Update: 2020-08-27 11:50 GMT
ఇప్పటికిప్పుడు కాదు కానీ.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం దేశంలో అప్పుడు రెండు అంశాల మీద తరచూ వివాదాలు.. గొడవలు జరుగుతుండేవి. రాజకీయ పార్టీల మధ్య కూడా తరచూ ఈ రెండు అంశాల మీదనే తమ వాదనల్ని హాట్ హాట్ గా వినిపించేవారు. ఈ సందర్భంగా వ్యక్తుల మధ్య మాత్రమే కాదు.. సమాజంలోనూ ఒకరిపై ఒకరు ప్రదర్శించే సహజ ప్రేమ కాస్తా వివాదంగా మారిన పరిస్థితి. మండల్.. మందిర్ అంటూ కొన్నేళ్ల పాటు ఈ రెండు ఇష్యూల చుట్టూనే దేశ రాజకీయాలు తిరిగేవి. కాలక్రమంలో అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి.

తాజాగా మరోసారి రిజర్వేషన్ల అంశం తెర మీదకు వచ్చింది. ఓపక్క కరోనా దెబ్బకు కిందా మీదా పడుతున్న మహారాష్ట్ర సర్కారు.. తాజాగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. మహారాష్ట్రలో 80 శాతం మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారన్న ముఖ్యమంత్రి ఉద్దవ్..తన వాదనను సుప్రీం ఎదుటకు తీసుకెళ్లింది.

ఇంద్ర సాహ్నీ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి 1992లో తీర్పు ఇచ్చారు. దీని ప్రకారం దేశంలో రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదు. ఇక్కడ సమస్య ఏమంటే.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోసం పదిశాతం రిజర్వేషన్ కేటాయించిన తర్వాత రిజర్వేషన్ల శాతం 28 రాష్ట్రాల్లో యాభై శాతం దాటిపోయింది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని మరాఠా వర్గాల వారికి ఉద్యోగాల్లో 12 శాతం కోటా కేటాయించారు. దీంతో.. రిజర్వేషన్ల వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. మహారాష్ట్రలో మొదలైన ఈ అంశం.. మిగిలిన రాష్ట్రాల్ని తగులుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి.. ఏమవుతుందో?



Tags:    

Similar News