సుశాంత్ ఆత్మహత్య కేసు : ' సీబీఐ అక్కర్లేదు ..ముంబై పోలీసులు చాలు '

Update: 2020-07-17 12:47 GMT
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి నెల రోజులు దాటిపోయింది. గత నెల 14న ఆయన తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణాన్ని అయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోగా మంచి కెరీర్ వదిలేసి చనిపోవాల్సిన అవసరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు లేదని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసారని అభిమానులు , పలువురు ప్రముఖులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో సీబీఐ విచారణకి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా తన బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తనకు తెలియాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించండి అంటూ హోం మంత్రి అమిత్‌ షాకు ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య పై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ ఆత్మహత్య కేసును ముంబయి పోలీసులు ఛేదించగలరని, ఇలాంటి కేసులను వారు ఎన్నో పరిష్కరించారని, ఈ సమయంలో సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని అనిల్‌ దేశ్‌ ముఖ్ తెలిపారు. ముంబయి పోలీసులు ప్రతి కోణంలోనూ సుశాంత్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో 35 మందిని ప్రశ్నించారు ముంబై పోలీసులు. ఇప్పటికే సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, తోటి నటీనటులతో పాటు కొంత మంది దర్శక, నిర్మాతల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పటికే సుశాంత్ గదిలో లభించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలపై ఎలాంటి వాస్తవాలు బయటకు రాలేదని పోలీసులు చెబుతున్నారు.
Tags:    

Similar News