విధ్వంస‌ర‌చ‌న: గాంధీని వ‌దల్లేదు

Update: 2018-03-08 09:09 GMT
ఈశాన్యంలో మొదలైన విగ్రహాల కూల్చివేత ఘటనలు పశ్చిమ భారతం గుండా దక్షిణాదికి చేరాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో స్థానిక బీజేపీ శ్రేణులు అక్కడి లెనిన్ విగ్రహాలను కూల్చివేయడం - వారికి రాష్ట్ర గవర్నర్ - కేంద్ర మంత్రులు వత్తాసు పలుకడంతో రెచ్చిపోయిన ఆ పార్టీ కార్యకర్తలు తమిళనాడులో ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు ప్రతీకారంగా వామపక్ష కార్యకర్తలు పశ్చిమ కోల్‌ కతాలో జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై పెట్రోలు బాంబు దాడి జరిగింది. మరోవైపు ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని మీరట్‌ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అగ్రకులానికి చెందిన వారు ధ్వంసం చేశారు.  ఈ ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌ నాథ్‌ ను ఆదేశించారు. అయినా విగ్రహాల విధ్వంసం మాత్రం ఆగడం లేదు.

తాజాగా మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. తాజాగా కేరళలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కన్నూరు జిల్లాలోని తాలిపరాంబా తాలూకా ఆఫీస్ దగ్గర్లోని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం ఉదయం  ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. విగ్రహంపైకి రాళ్లు విసరడంతో కళ్లద్దాలు - మెడలోని దండ ధ్వంసమయ్యాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు. మూడు రోజులుగా దేశవ్యాప్తంగా లెనిన్ - పెరియార్ - శ్యామ ప్రసాద్ ముఖర్జీ - అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే.

తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దాడికి పాల్పడిన వారిగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులు లొంగిపోయారని - వారిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. వెళ్లూరులోని మున్సిపల్ కార్యాలయంలోగల ద్రవిడ నాయకుడు పెరియార్ రామస్వామి విగ్రహాన్ని ఇద్దరు వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. లొంగిపోయిన ముగ్గురు తాంతాయి పెరియార్ ద్రవిడ కళగం (టీపీడీకే)కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ద్రవిడార్ విడుత్తళై కళగం (డీవీకే)కు చెందిన నలుగురు కార్యకర్తలు మైలపూర్‌ లోని నల్లతంబి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఎనిమిదిమంది జంధ్యాలను కోసివేశారు. ఆ తరువాత వారు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. త్రిపురలో బీజేపీ కార్యకర్తలు రష్యా కమ్యూనిస్టు నాయకుడు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్‌ బుక్‌ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడులో ఈ చిచ్చు రగిలినట్టు తెలుస్తున్నది. కొద్దిసేపటి తరువాత ఆ వ్యాఖ్యలను తొలిగించిన రాజా - తన ఫేస్‌ బుక్ ఖాతాను నిర్వహిస్తున్న సిబ్బంది ఆ పోస్ట్‌ ను పెట్టారని బుధవారం వివరించారు. రాజాకు వ్యతిరేకంగా పలు పార్టీలు తమిళనాడులో రాస్తారోకోలు - ప్రదర్శనలు నిర్వహించాయి. కావేరీ జల వివాదం అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించిన సినీ నటుడు కమల్‌ హాసన్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News