సుడి అంటే మహమూద్ అలీదేనబ్బా?

Update: 2019-08-26 08:36 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంతా తానై నడిపేటోళ్లను ముఖ్యమంత్రి అంటారు. ఆ స్థాయి వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మంత్రులకు దక్కితే అంతకు మించిన లక్ మరేం ఉంటుంది. ఒక జాతీయ స్థాయి సమావేశంలో.. అందునా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులంతా హాజరైన చోట.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించటానికి మించిన అవకాశం ఇంకేం ఉంటుంది.

నిజానికి.. ఒక్క కార్యక్రమానికే కాదు.. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సిన సమావేశాలకు ఆయనకు బదులుగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వెళుతున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యన జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. దానికి ముఖ్యమంత్రి హాజరు కావాలి. కానీ.. ఆయనకు బదులుగా వెళ్లారు మహమూద్ అలీ.

ఇదొక్కటేనా.. ఈ మధ్యనే హైదరాబాద్ మహానగరానికి ఆభరణంగా మారుతుందని చెప్పే అమెజాన్ భారీ భవనాన్ని ప్రారంభించాల్సింది ముఖ్యమంత్రి కేసీఆరే. కానీ.. ఎందుకో కేసీఆర్ ఆ ప్రోగ్రామ్ కు కూడా వెళ్లలేదు. తన తరఫున రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీని పంపారు. ఇలా ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు.. కీలకమైన సభలకు కేసీఆర్ కాకుండా మహమూద్ అలీ వెళ్లటం హాట్ టాపిక్ గానే కాదు.. గులాబీ నేతలు పలువురు అసూయతో కుళ్లుకునేలా చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. కొందరికి కాలం కలిసి వస్తుందని ఊరికే అనరు కదా.
Tags:    

Similar News