జుకర్ బర్గ్ చైర్మ‌న్ ప‌ద‌వికి ఎస‌రు?

Update: 2018-10-19 11:01 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారుల వ్య‌క్తిగ‌త స‌మాచారం లీక్ అయిన వార్త కొద్ది రోజుల క్రితం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఫేస్ బుక్ లో వ్య‌క్తిగ‌త స‌మాచారం చౌర్యానికి గుర‌వ‌డం - డేటా బ్రీచ్ కావ‌డం క‌ల‌కలం రేపింది. కోగన్.. కేంబ్రిడ్జ్.. ఎనలిటికా సంస్థలు....డేటాను దుర్వినియోగం చేశాయ‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా ధృవీక‌రించారు. డేటా బ్రీచ్ కాకుండా తాము చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని, భ‌విష్య‌త్తులో ఇటువంటివి జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని జుక‌ర్ బ‌ర్గ్ తెలిపారు. దీంతో పాటు ఫేక్ న్యూస్ ను క‌ట్ట‌డి చేయ‌డంలో ఫేస్ బుక్ త‌గిన చ‌ర్యలు తీసుకోకుండా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ జుక‌ర్ బ‌ర్గ్ ప‌దవికి ఎస‌రు తెచ్చేట్టు క‌నిపిస్తున్నాయి. జుకర్‌బర్గ్ ను సీఈవో ప‌ద‌వి నుంచి తొలగించాలనే ప్రతిపాదన తెరపైకి రావ‌డం ఇపుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఫేస్‌ బుక్‌ ఇంక్ లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న 4 దిగ్గజ అమెరికా పబ్లిక్‌ ఫండ్స్‌ జుకర్‌ బర్గ్‌ ను చైర్మన్‌గా తొలగించాలని ప్రతిపాదించిన‌ట్టు తెలుస్తోంది. కంపెనీలో అతిపెద్ద అసెట్‌ మేనేజర్లు కూడా ఆ ప్ర‌తిపాద‌న‌కు సుముఖంగా ఉన్నార‌ట‌. ఇల్లినోయిస్‌‌ - రోడ్ ఐలండ్ - పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్‌ ట్రెజర్స్ - న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ లు ఈ ప్ర‌తిపాద‌న పెట్టాయి. 2019 మేలో జ‌ర‌గ‌బోతోన్న వార్షిక సమావేశంలో ఈ తొల‌గింపు ప్రతిపాదనన చ‌ర్చ‌కు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. స్వతంత్ర బోర్డ్‌ చైర్ ను నియమించాలని బోర్డును కోరతామని ఆ సంస్థ‌లు తెలిపాయి. ఇలాంటి ప్రతిపాదనే ఫేస్‌బుక్‌లో 2017లో ఒకసారి వచ్చింది. కానీ, అది కార్య‌రూపం దాల్చ‌లేదు. 60శాతం ఓటింగ్‌ హక్కులు జుకర్‌ బర్గ్ కు ఉండటంతో, ఈ 2019లో తొల‌గింపు ప్రతిపాదన ఎంత‌వ‌ర‌కు ఆమోదం పొందుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే!

Tags:    

Similar News