ప‌బ్ లో ఫైర్ యాక్సిడెంట్ 15 మంది మృతి

Update: 2017-12-29 05:11 GMT
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.ఉత్సాహంగా.. సంద‌డిగా.. హైసౌండ్ తో సాగిపోయే ఒక ప‌బ్ లో చోటు చేసుకున్న షార్ట్ స‌ర్క్యూట్ 15 మంది నిండు ప్రాణాల్ని బ‌లి తీసుకున్న ఘ‌ట‌న జ‌రిగింది. ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో లోయ‌ర్ ప‌రేల్ లో ఉన్న క‌మ‌ల మిల్స్ స‌ముదాయంలో ఓపెన్ టాప్ ప‌బ్ లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది.

గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఓపెన్ రూఫ్ టాప్ ప‌బ్ (లండన్‌ టాక్సీ గ్యాస్ట్రో పబ్‌) లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే మంట‌లు భారీగా విస్త‌రించాయ‌ని చెబుతున్నారు. ఈ మంటల్లో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు 12 మంది తొలుత మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. మ‌రో 12 మందికి గాయాలు అయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక బ‌ర్త్ డే పార్టీ కోసం ఏర్పాటు చేసిన విందు కార్య‌క్ర‌మం భారీ విషాదాన్ని రేకెత్తించింది. అగ్నిప్ర‌మాదానికికార‌ణంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గురువారం అర్థ‌రాత్రి 12.30 గంట‌ల వేళ‌లో మంట‌లు  రాగా.. ఒంటి గంట వ‌ర‌కూ అగ్నికీల‌లు ప‌బ్ ను కాల్చేసిన‌ట్లు చెబుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ సంద‌ర్భంగా తొక్కిస‌లాటు చోటు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ప‌బ్ లోని రెస్టారెంట్ లో షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా భావిస్తున్నారు.

అగ్నిప్ర‌మాదం గురించి స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిందా? ఇంకేదైనా కార‌ణం ఉందా? అన్న కోణంలో అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News