మెజార్టీ లెస్: మహారాష్ట్ర పై బీజేపీ ప్లానేంటి?

Update: 2019-11-24 06:15 GMT
అధికారం బెల్లం లాంటింది. దాని చుట్టూ ఈగలు వాలినట్టే నేతలు కూడా వాలి పోతారు. అధికారం లేనిదే  డమ్మీ గా భావిస్తారు. దేశ ఆర్థిక రాజధాని ఉన్న రాష్ట్రాన్ని వదలుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. మెజార్టీ లేకున్నా తిమ్మిని బమ్మిని చేసి గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. సరిపడా బలం లేకున్నా మహారాష్ట్ర లో బీజేపీ కొలువుదీరింది. బీజేపీ కి ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మేజిక్ మార్క్ 145. ఇంకా 40 మంది కావాలి. ఈ నేపథ్యంలో మెజార్టీ లేని బీజేపీ మహారాష్ట్ర లో ఏం చేయబోతున్నదన్నది ఆసక్తి గా మారింది.  

గోవా,కర్ణాటక, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బీజేపీ కి ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఆ పార్టీకి మేజిక్ మార్క్ రాలేదు. అయినా అక్కడ గద్దెనెక్కిన ప్రభుత్వాలను కూలదోసి ఎమ్మెల్యేలను బతిమాలి, భయపెట్టి, ప్రలోభ పెట్టి చివరకు గద్దెనెక్కింది. మరి దేశంలో కీలకమైన మహారాష్ట్ర ను బీజేపీ ఎలా వదలుకుంటుంది. ఆర్థిక రాజధాని కొలువై ఎన్నో పరిశ్రమల కు నెలవైన మహారాష్ట్ర విషయంలోనూ బీజేపీ పట్టుదల గా ఉంది.

గోవా, కర్ణాటక, హర్యానాలనే చేజిక్కించుకున్న కమలం.. ఇప్పుడు మహారాష్ట్ర లో అన్ని పార్టీలకంటే అత్యధిక సీట్లు సాధించి మెజార్టీ దక్కక పోతే అధికారం వదులుకుంటుందా? అస్సలు వెనకడుగు వేయదు కదా.. అందుకే చక్రం తిప్పుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం లేకున్నా.. శివసేన హ్యాండిచ్చినా.. శరద్ పవార్, కాంగ్రెస్ అడ్డుగా నిలబడ్డా ఇప్పుడు ఎన్సీపీని చీల్చడం.. స్వతంత్రులు, చిన్న పార్టీలను కలుపుకొని మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంది.

మరి అన్ని రాష్ట్రాల వలే మహారాష్ట్ర లోనూ బీజేపీ పప్పులు ఉడుకుతాయా? శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్ పంతం నెగ్గుతుందా అనేది వేచిచూడాలి.
Tags:    

Similar News