బ్లాక్ మనీ రాయుళ్లకు చిట్టచివరి ఛాన్స్

Update: 2016-12-17 04:57 GMT
నల్లధనంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ.. నల్లకుబేరులకు చిట్టచివరిగా ఒక ఛాన్స్ ను ఇచ్చేలా సరికొత్త పథకాన్నితాజాగా ప్రకటించారు. నల్లధనానికి సంబంధించి స్వచ్ఛందంగా ప్రకటించే ఐడీఎస్ పథకానికి కాసిన్ని మార్పులు చేసి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజు (శనివారం) నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనగా పేరు పెట్టారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది (2017) మార్చి 31 వరకూ అమలు చేయనున్నారు.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ వద్ద కుప్పలు.. కుప్పలుగా ఉన్న పన్ను ఎగవేత మొత్తాన్ని అక్రమ పద్ధతిలో వైట్ గా మార్చేందుకు కిందా మీదా పడుతున్న వారిలో పలువురు దొరికిపోతున్న వేళ.. కేంద్రం ప్రకటించిన చిట్టచివరి అవకాశం లాభం చేకూరుస్తుందనటంలో సందేహం లేదు. ఈ పథకం కింద నల్లకుబేరులు తమ దగ్గరున్న నల్లధనానికి సంబంధించిన వివరాల్ని బుద్ధిగా వెల్లడించి.. ప్రభుత్వం సూచించిన మొత్తంలో జరిమానాను కట్టేస్తే.. వారి నల్లధనం కాస్తా వైట్ మనీగా మారటమే కాదు.. వారి వివరాల్ని గోప్యంగా ఉంచేస్తారు.అంతేకాదు.. కేసులు.. వగైరా.. వగైరా లాంటివి లేకుండా చేయనున్నట్లు ప్రకటిస్తున్నారు.

తాజా పథకంలో బ్లాక్ మనీ రాయుళ్లు ఏం చేయాల్సి ఉంటుంది? వారు వెల్లడించే బ్లాక్ మనీలో ఎంత మొత్తాన్ని జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని చూస్తే.. బ్లాక్ మనీని ప్రకటించే వారు.. తాము ప్రకటించే ఆస్తుల్లో యాభై శాతాన్ని జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంలో 25 శాతాన్ని నాలుగేళ్ల వరకూ ప్రభుత్వం దగ్గర ఉంచేస్తారు. 25 శాతాన్ని వైట్ చేసి ఇచ్చేస్తారు. గడువు తీరిన తర్వాత.. ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి ఇచ్చేస్తారు. ఈ పథకం కింద నల్లధనాన్ని ప్రకటించిన వారిపై విచారణలు.. కేసులు.. లాంటివి ఏమీ ఉండవు.

ఈ పథకం కింద నల్లధనాన్ని ప్రకటించకుండా తమ దగ్గరున్న పాత నోట్లను భార ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే.. ఇలాంటి వారు పన్ను.. జరిమానా అన్నీ కలిపి 77.25 శాతం చెల్లించాల్సి ఉండటంతో పాటు.. కేసులు.. విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించటానికి మించిన సుఖమైన అంశం మరొకటి ఉండదన్న విషయాన్ని కేంద్రం తన తాజా నిర్ణయంతో స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.

తాజాగా ప్రకటించిన పథకం కింద నల్లధనాన్ని ప్రకటించే నల్లకుబేరులు  డిక్లరేషన్ తో పాటు.. పాన్ వివరాల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కానీ లేకుంటే... దాని కోసం అప్లై చేసి.. ఆ వివరాల్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అంతేకాదు.. తాము వెల్లడించే ఆదాయానికి సంబంధించిన విలువలో 25 శాతానికి తగ్గకుండా మొత్తాన్ని నగదు రూపంలో కానీ.. ఎలక్ట్రానిక్ ట్రాన్సఫర్ ద్వారా మొత్తాన్నిబదిలీ చేయాల్సి ఉంటుంది. మరి.. మోడీ సర్కారు తాజాగా ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ కు నల్లకుబేరులు ఎంతలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News