రాజ్‌ నాథ్ చేతికి టీడీపీ కుంభ‌కోణం చిట్టా

Update: 2017-06-21 06:12 GMT
దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన విశాఖ భూ కుంభ‌కోణం ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడును ఇర‌కాటంలో ప‌డేసే విధంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే విప‌క్షాలు - ప్ర‌జాసంఘాలు - ఆఖ‌రికి మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ సైతం ఏపీ స‌ర్కారు తీరును త‌ప్పుపడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ ఢిల్లీకి చేర‌నుంది. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు అవినీతిపై క్షేత్ర‌స్థాయి పోరాటంతో పాటు ఢిల్లీ వేదిక‌గా ఫిర్యాదులు చేస్తామ‌న్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం మొద‌లుకొని, ప‌థ‌కాల అమ‌లు వ‌ర‌కు రాష్ట్రంలో అన్ని అంశాల్లోనూ అవినీతి ఏరులై పారుతోంద‌ని మ‌ల్లాది విష్ణు ఆరోపించారు. విశాఖ భూ కుంభ‌కోణం అధికార తెలుగుదేశం పార్టీ అక్ర‌మాల‌కు అద్దం ప‌డుతుంద‌న్నారు. అందుకే ఢిల్లీ వేదిక‌గా రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యాల‌ను తెలియ‌జెప్పేందుకు నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి - ఎంపీ కేవీపీ రామచంద్రరావు - తదితర నాయకులు ఈనెల 22వ తేదీన కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ ను కలిసి విశాఖ భూకుంభకోణంపై విచారణకు ఆదేశించాలని కోరనున్నట్లు మ‌ల్లాది విష్ణు తెలిపారు. కాగా, బ్రాహ్మణ సామాజికవర్గం అంటే ప్రభుత్వానికి చులకనభావం అని విష్ణు విమర్శించారు. నీతి నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును అకారణంగా పదవి నుంచి తప్పించి, బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి తన ప్రేమను చాటుకున్నారని ఎద్దేవా చేశారు. కనీస వివరణ తీసుకోకుండా తొలగించడం నీతి నిజాయితీని సమాధి చేసేందుకేనని విమర్శించారు.

రాష్ట్రంలో ఇసుక - రవాణా మాఫియాలు పేట్రేగిపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు లేరని విష్ణు మండిప‌డ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తున్నారని, నగరాభివృద్ధి చేస్తారని టిడిపికి ప్రజలు పట్టం కడితే 8 వేల ఇళ్లు కట్టలేమని వెనక్కి పంపిన ఘనత ప్రస్తుత పాలకులకే చెందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి, నివాసానికి సిద్ధంగా ఉన్న 4 వేల ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము పెట్టిన 20 అంశాలతో కూడిన ఛార్జ్‌ షీటుపై బహిరంగ చర్చకు రావాలని స‌వాల్ విసిరారు. రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, నకిలీ విత్తనాలు అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు. పట్టిసీమతో కృష్ణాడెల్టాకు ఉపయోగం లేదని, పులిచింతలను పూర్తిచేయాలని ఆయన కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News