బెజ‌వాడ‌లో వైసీపీకి మ‌రింత బ‌ల‌మొచ్చేసింది!

Update: 2017-07-04 05:49 GMT
తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో మొన్న‌టిదాకా పెను మార్పులే చోటుచేసుకున్నాయి. విప‌క్షానికి చెందిన నేత‌లు అధికార పార్టీల నేత‌లుగా మారిపోయారు. అదే స‌మ‌యంలో నంద్యాల బైపోల్స్ నేప‌థ్యంలో అధికార పార్టీ నుంచి కూడా విప‌క్షంలోకి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయ‌ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకో రెండేళ్ల పాటు అధికారంలో ఉండే టీడీపీని వ‌దులుకుని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీలోకి చేరిపోయారు. శిల్పా వెంట భారీ స్థాయిలో కార్య‌క‌ర్త‌లు - ద్వితీయ శ్రేణి తెలుగు త‌మ్ముళ్లు కూడా వైసీపీకి జైకొట్టారు. ప్ర‌స్తుతం నంద్యాల‌లో అధికార పార్టీ కంటే కూడా విప‌క్ష వైసీపీకే గెలుపు అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇదంతా రాయ‌ల‌సీమ రాజ‌కీయం అనుకుంటే... కోస్తాంధ్ర‌లో రాజ‌కీయంగా మంరి ప‌రిణతి ఉన్న జిల్లాగా కృష్ణా జిల్లాకు పేరుంది. బెజ‌వాడ రాజ‌కీయాల కార‌ణంగానే ఆ జిల్లాకు ఆ పేరు వ‌చ్చింది.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లాలో మెరుగైన ఫ‌లితాల‌నే సాధించిన వైసీపీ... బెజ‌వాడ న‌గ‌రంలోనూ త‌న స‌త్తా చాటింది. అయితే అధికార పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు వైసీపీ టికెట్‌ పై విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌లీల్ ఖాన్ లొంగిపోయారు. వైసీపీకి రాజీనామా చేయ‌కుండానే ఆయ‌న టీడీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి రాధ ఉన్నా... వైసీపీకి మ‌రింత మంది నాయ‌కుల అస‌వ‌రం ఎంతైనా ఉంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉంటూ వ‌స్తున్న మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు... ఇప్పుడు వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధ‌మైపోయింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న పాపం కాంగ్రెస్ పార్టీకి అంటుకున్న కార‌ణంగా మ‌ల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెల‌వ‌లేక‌పోయారు. ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైనా మ‌ల్లాది విష్ణుకు ఇప్ప‌టికీ న‌గ‌రంలో మంచి ప‌ట్టు ఉంది. న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆయ‌న‌కు అనుచ‌ర‌వ‌ర్గాలున్నాయి.

ఇప్పుడిప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కేశినేని నాని, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు - బోడె ప్ర‌సాద్‌... త‌దిత‌రుల‌తో పోలిస్తే మ‌ల్లాది చాలా సీనియ‌ర్ కిందే లెక్క‌. ఏపీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్థాయి ఉన్న నేత కూడానూ. ఈ క్ర‌మంలో మ‌ల్లాది విష్ణు వైసీపీలోకి చేరితే... ఆ పార్టీకి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో అధికార టీడీపీని ఎదిరించి ముంద‌కెళ్లే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ... సింగిల్‌గా వంగ‌వీటి ఎంత‌కాల‌మ‌ని పోరాడ‌తారు. అదే మ‌ల్లాది విష్ణు గ‌నుక పార్టీలోకి వ‌స్తే... టీడీపీ అరాచ‌కాల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనే స‌త్తా వైసీపీకి ద‌క్కుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో మంచి సంబంధాలు నెర‌పిన మ‌ల్లాది... ఇప్పుడు ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే క‌ల‌గ‌ల‌సి పోతార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు ప‌లికి వైసీపీలోకి చేరే విష‌యంపై మ‌ల్లాది ఇప్ప‌టికే త‌న అనుచ‌రవ‌ర్గంతో చాలా సార్లు ప్ర‌త్యేకంగా భేటీలు నిర్వ‌హించార‌ట‌. కార్య‌క‌ర్త‌లంతా జ‌గ‌న్ పార్టీలోకి చేరే విష‌యానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పార్టీ మారేందుకే మ‌ల్లాది నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని తెలుసుకున్న వైసీపీ కూడా మ‌ల్లాది రెడ్ కార్పెట్ ప‌రిచేందుకు సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నెల 8 - 9 తేదీల్లో విజ‌య‌వాడ‌లోనే వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఆ రెండు రోజుల్లోనే ఏదో ఒక స‌మ‌యంలో మ‌ల్లాది... జ‌గ‌న్ సమ‌క్షంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై ఇటు మ‌ల్లాది వ‌ర్గం గానీ, అటు వైసీపీ నుంచి ఎలాంటి ఖండ‌న‌లు రాని నేప‌థ్యంలో వైసీపీలోకి మ‌ల్లాది చేరిక ఖాయ‌మైపోయింద‌నే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News