పార్టీ మారినా... ప‌చ్చ‌ జ‌ప‌మేనా మ‌ల్లారెడ్డీ!

Update: 2017-04-05 09:12 GMT
మ‌ల్లారెడ్డి... హైద‌రాబాదు జంట న‌గ‌రాల్లో మ‌ల్లారెడ్డి క‌ళాశాల‌ల పేరిట ప‌లు విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేసిన విద్యావేత్త‌గా అంద‌రికీ చిర‌ప‌ర‌చితులే. మొన్న‌టి ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మ‌ల్లారెడ్డి... ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత మారిన రాజకీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పేసిన మ‌ల్లారెడ్డి... అధికార టీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. ప్రస్తుతం ఆయ‌న టీఆర్ఎస్ నేతగానే కొన‌సాగుతున్నారు. మ‌ల్లారెడ్డి పార్టీ మారి చాలా కాల‌మే అయిన‌ప్ప‌టికీ... ఇప్ప‌టికీ కూడా ఆయ‌న‌లో పాత వాస‌న‌లు పూర్తిగా పోలేద‌న్న వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా నిన్న ఓ ఘట‌న జ‌రిగింది.

మేడ్చ‌ల్‌ లోని త‌న క‌ళాశాల వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భావించిన మ‌ల్లారెడ్డి... స‌ద‌రు కార్య‌క్ర‌మానికి టీఆర్ ఎస్ కీల‌క నేత‌ - నిజామాబాదు ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మ‌ల్లారెడ్డి ఆహ్వానాన్ని మ‌న్నించిన క‌విత కూడా ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా... కార్య‌క్ర‌మంలో భాగంగా విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడిన మ‌ల్లారెడ్డి... త‌న ప్ర‌సంగాన్ని ముగించే సంద‌ర్భంగా జై తెలంగాణ‌కు బ‌దులుగా జై తెలుగుదేశం అని నినదించారు. ఆ తర్వాత సర్దుకొని జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు.

ఈ విష‌యాన్ని వెంట‌నే గుర్తించిన మ‌ల్లారెడ్డి... త‌న వ్యాఖ్య‌ల‌ను స‌రిచేసుకునే క్ర‌మంలో జై తెలంగాణ - జై కేసీఆర్ - జై కవితమ్మ అంటూ ముగించారు. ఇక ఆ త‌ర్వాత మైకందుకున్న క‌విత‌... మల్లారెడ్డి త‌డ‌బాటును ప్ర‌స్తావిస్తూ... మల్లారెడ్డి అన్న దగ్గర ఒక్కటే విషయం ఉందని, ఆయన దగ్గర ఇంకా పాత పచ్చ జెండా వాసన పోవడం లేదని, అదొక్కటి తప్పితే మిగతా అంతా కూడా పింక్ జెండా బాట పట్టాడన్నారు. వాతావ‌ర‌ణాన్ని మ‌రింత చ‌ల్ల‌బ‌రిచే క్ర‌మంలో మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసిన క‌విత‌... తనది కూడా తప్పు కావొచ్చునని, ఇవాళ పసుపు పచ్చ చీర కట్టుకొని వచ్చానని చమత్కరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News