అయ్యో.. మ‌మ‌త‌.. మ‌రో మంత్రి అదే బాట‌లో!

Update: 2022-09-01 13:08 GMT
ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి క‌ష్టాలు తీర‌డం లేదు. ఇటీవ‌ల ఉపాధ్యాయుల నియామ‌కం కుంభ‌కోణంలో తృణ‌మూల్ కాంగ్రెస్ మంత్రి పార్థా చ‌ట‌ర్జీ, ఆయ‌నకు అత్యంత స‌న్నిహితురాలు అర్పితా ముఖ‌ర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా అర్పితా ముఖ‌ర్జీ నివాసంలో 25 కోట్ల డ‌బ్బు, భారీ ఎత్తున బంగారం, స్థిర, చ‌రాస్తుల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పార్థా చ‌ట‌ర్జీని తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ బ‌హిష్క‌రించారు.

ఇంత‌లోనే మ‌ళ్లీ బొగ్గు కుంభ‌కోణం కేసులో మ‌రో మంత్రి మోలాయ్ ఘ‌ట‌క్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది. మంత్రి మోలాయ్ ఘ‌ట‌క్‌ తో పాటు టీఎంసీ ఎమ్మెల్యే మహతోకు కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. మోలాయ్ ఘ‌ట‌క్.. మ‌మ‌తా బెన‌ర్జీ మంత్రివ‌ర్గంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్ప‌టికే వీరిద్దిరికీ స‌మ‌న్లు ఇచ్చి విచార‌ణ చేసిన‌ప్ప‌టికీ వారు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేద‌ని ఈడీ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు వారికి స‌మ‌న్లు జారీ చేసింది.

ఆగ‌స్టు 28న తృణ‌మూల్ కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అభిషేక్ బెనర్జీ బొగ్గు కుంభ‌కోణంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడ‌ని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేశారు.

అభిషేక్ బెనర్జీ తర్వాత మోలోయ్ ఘటక్‌ని పిలుస్తారని అంతా అనుకున్నారు. వారు ఊహించిన‌ట్టే మోలాయ్ ఘ‌ట‌క్ కు ఈడీ స‌మ‌న్లు ఇచ్చింది. బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెప్టెంబర్ 14న మోలోయ్ ఘటక్‌ను న్యూఢిల్లీకి రావాల‌ని ఆదేశించింది.

సెప్టెంబరు 5న ఇదే కేసులో అభిషేక్ బెనర్జీ కోడ‌లు మేనక గంభీర్‌కు కూడా ఈడీ విచారణకు రావాల‌ని ఆదేశించింది. గంభీర్‌ని న్యూఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి రావాల‌ని ఆదేశించింది.

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు సమీపంలోని కునుస్టోరియా మరియు కజోరా ప్రాంతాల్లోని తూర్పు బొగ్గు క్షేత్రాల లీజు హోల్డ్ గనుల్లో అక్రమంగా బొగ్గు తవ్వకాలు జరిగాయని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. 1,300 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని, ఇందులో ఎక్కువ భాగం పలువురి ప్రభావవంతమైన వ్యక్తుల వద్దకు వెళ్లినట్లు సీబీఐ పేర్కొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News