ఆర్ ఎస్ ఎస్‌ కి మ‌మ‌త భ‌లే షాకిచ్చారుగా!

Update: 2017-09-06 05:11 GMT
బీజేపీ అన్నా.. దాని పుట్టిల్లు ఆర్ ఎస్ ఎస్(రాష్ట్రీక స్వ‌యం సేవ‌క్ సంఘ్‌) అన్నా.. ఉప్పు నిప్పులా మండిప‌డే ప‌శ్చిమ బెంగాల్ సీఎం - తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. తాజాగా ఆ సంస్థ‌కు గ‌ట్టి షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాల‌న‌పై ఒంటి కాలిపై లేస్తున్న మ‌మ‌త‌.. త‌నకు క‌సి తీర్చుకునేందుకు వ‌చ్చిన అవకాశాన్ని పూర్తి గా వినియోగించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. విష‌యంలోకి వెళ్తే.. ఆర్ ఎస్ ఎస్  చీఫ్ మోహన్‌ భగవత్ పశ్చిమ బెంగాల్‌ లో ఓ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టారు. దీనికిగాను ఆయ‌న అక్టోబ‌రు నెలలో ముహూర్తం పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలో క‌నీసం నెల ముందుగానే ఆయ‌న  కోల్‌ కతాలోని ప్రఖ్యాత మహజాతి సాదన్‌ ఆడిటోరియంను బుక్ చేసుకున్నారు. ముందు నిర్ణీత మొత్తం క‌ట్టించుకున్న అధికారులు ఆడిటోరియం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో ఆర్ ఎస్ ఎస్ నేత‌లు - కార్య‌క‌ర్త‌లు త‌మ త‌మ ఏర్పాట్ల‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అయితే, ఇంత‌లో ఈ విష‌యం సీఎం మ‌మ‌తా చెవిలో ప‌డింది. అంతే! ఒక్క‌సారిగా అగ్గిమీద గుగ్గిల‌మైన ఆమె.. స‌ద‌రు ఆడిటోరియం అనుమ‌తులు ర‌ద్దు చేయాలంటూ అధికారుల‌కు హుకుం జారీ చేశారు.

ఇంకే ముంది... ఆడిటోరియం బుకింగ్‌ ను రద్దు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు ఆర్ ఎస్ ఎస్‌ కు మౌఖికంగా తెలిపాయి. దీంతో బెంగాల్  ప్రభుత్వ ఆధీనంలోని ఆడిటోరియంను ఆర్‌ ఎస్‌ ఎస్ కు ఇవ్వడం సీఎం మమతా బెనర్జీకి ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. మ‌రోప‌క్క‌, గ‌తంలోనూ ఆర్ ఎస్ ఎస్ అధినేత‌కు  బెంగాల్ ప్ర‌భుత్వం ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో కోల్‌ కతా జ‌రిగిన ర్యాలీలో పాల్గొనేందుకు మోహన్‌ భగవత్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయ‌న కలకత్తా హైకోర్టు జోక్యంతో  ర్యాలీలో పాల్గొన్నారు. మ‌రి ఇప్పుడు ఏకంగా ఆడిటోరియం ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నో చెప్ప‌డంతో భ‌గ‌వ‌త్ మ‌ళ్లీ కోర్టుకు ఎక్కుతారా?  సంప్ర‌దింపులు జ‌రుపుతారా?  చూడాలి. మొత్తానికి మ‌మ‌త ప్ర‌భుత్వం ఆర్ ఎస్ ఎస్‌పై క‌సితీర్చుకుంద‌నే వ్యాఖ్య‌లు మాత్రం వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News