మమతమ్మ రూట్.. అదే వర్కౌట్...?

Update: 2022-02-06 01:30 GMT
పాలిటిక్స్ లో ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఒడిసి పట్టుకుంటే ఎన్ని సార్లు అయినా గెలవచ్చు. రీసెంట్ గా  చూస్తే ఎదుటి పక్షం బలం కంటే బలహీనతల మీదనే ఆధారపడి ఎక్కువగా  పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో సూటిగా రాజకీయం చేసేవారు. ఇపుడు సైడ్ నుంచి వస్తున్నారు. ప్రత్యర్ధిని తక్కువ చేయాలంటే ఇంకో పెద్ద గీత గీస్తే సరిపోతుంది. దాంతో జనాల దృష్టిలో అంగుష్టమాత్రుడిగా  ప్రధాన పక్షం కనిపిస్తుంది. పెద్ద గీత గీసి తాము కోరుకున్న ప్రియ మిత్రుడుతోనే ముసుగులో గుద్దులాట అన్న మాట. ఆ మీదట ఎటూ  తాము సృష్టించిన పెద్ద గీతే  కనుక హ్యాపీగా దాన్ని  దాటేసుకుని పోవచ్చు,ఎంచక్కా విజయ తీరాలకూ చేరువ కావచ్చు.

ఇదంతా పశ్చిమ బెంగాల్ లో వర్కౌట్ అయింది. బెంగాల్ అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ఏళ్ళ తరబడి సాగిన  కమ్యూనిస్ట్ పాలన. వారిది మూడున్నర దశాబ్దాల పైగా అప్రతిహతంగా సాగిన ఎలుబడి.  ఎర్ర కోట అంటే అంతా ఢిల్లీ వైపు చూస్తే, రాజకీయ పరిశీలకులు  మాత్రం బెంగాల్ వైపే దృష్టి సారించేవారు. అలాంటి ఎర్రెర్రని  కోటను పాతాళాల దాకా  కూల్చింది మమతా బెనర్జీ.

మళ్ళీ మళ్లీ  కామ్రేడ్స్ అధికారంలోకి రాకుండా మమతమ్మ నాడు చేసిన పాలిటిక్స్ లో భాగనే ఎర్రకోటలో కాషాయం రంగులు పులుముకోవడం. కామ్రేడ్స్ ని తగ్గించడానికి కాషాయాన్ని ఒక్కసారిగా పెంచారు మమత. వారే తన టార్గెట్ అని ఒక రేంజిలో ఫైట్ చేశారు. ఇలా అటూ ఇటూ సాగిన బెంగాల్ చిత్ర విచిత్ర రాజకీయ  పోరులో కామ్రెడ్స్ సైడ్ అయిపోయారు. ఇక అసలు బలం  ఎంతో తెలిసిన కాషాయాన్ని సులువుగా ఓడించి మమత మూడవసారి కూడా ముఖ్యమంత్రి కుర్చీ పట్టేశారు.

సేమ్ టూ సేమ్ తెలంగాణాలో కూడా కధ నడపాలని కేసీయార్ చూస్తున్నాట్లుగా అనిపిస్తోందంటే ఆశ్చర్యం లేదుగా. కేసీయార్ కూడా బీజేపీ మీద ఒంటి కాలి మీద లేస్తున్నారు. తెలంగాణా అసెంబ్లీలో పట్టుమని మూడు సీట్లున్న బీజేపీని అతి పెద్ద భూతంగా చిత్రీకరిస్తున్నారు. ఆ పార్టీతోనే తెలంగాణాలో పోరు అన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు.

నిజానికి తెలంగాణాలో ఈ రోజుకీ బూత్ లెవెల్ లో ఉన్న పార్టీ, గట్టిగా ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ అనే చెప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ ని ఉద్దేశ్యపూర్వకంగానే  తక్కువ చేసి చూపే సీన్ కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ ని అసలు రంగంలో లేనట్లుగా భ్రమలు కల్పించే రాజకీయం కూడా సాగుతోంది.

ఈ నేపధ్యంలో కేసీయార్ ఒక్కసారిగా మోడీ మీద నిప్పులు చెరిగారు. గతంలో ఎవరూ ఎక్కడా అనని విధంగా నిందించారు. ఇక ప్రధాని స్వయంగా హైదరాబాద్ వస్తే తాను గైర్ హాజరయ్యారు.  అయితే కేసీయార్ కి ఒంట్లో స్వల్ప నలతగా ఉందని అంటున్నారు. కానీ అసలు కారణాలు వేరు అన్నది రాజకీయ పరిశీలకుల భావన. నిన్ననే మోడీని తిట్టి ఈ రోజు పుష్ప గుచ్చం పట్టుకుని కేసీయార్  స్వాగతం పలికితే వ్రతమూ ఫలమూ రెండూ దక్కే చాన్సే లేదు.

అందుకే అచ్చం మమతమ్మలా తాను కూడా కాషాయ దళానికి ఆగర్భ శత్రువుని అని చెప్పుకోవడానికే కేసీయార్ ఇలా చేశారని అనే వారూ ఉన్నారు. ఇక ఇక్కడితో ఇది ఆగదు, మోడీని, బీజేపీని డైలీ  తెగనాడుతూ గులాబీ యుద్ధం ఇంకా అరవీర భయంకరంగా సాగుతుంది. ఈ దెబ్బకు తెలంగాణా సమాజం అక్కడ నిజంగా టీయారెస్ పోటీ బీజేపీయేమో అని అనుకోవాలి. అలా ఏ కాస్తా బీజేపీ పెరిగినా ఆ నష్టం మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ కే. అలా చీలిన ఓట్లతో మైనారిటీల అండతో ముచ్చటగా మూడవసారి కుర్చీ ఎక్కేయాలన్న గులాబీబాస్ వ్యూహం ఫలిస్తుందా. చూడాలి మరి.
Tags:    

Similar News