దీదీ ఏమంటారో మ‌రి!

Update: 2022-02-13 15:30 GMT
కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై పోరు బావుటా ఎగ‌రేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశ‌గా దూసుకెళ్తున్నారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌ధాని మోడీపై, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట‌ల‌తో చెడుగుడు ఆడేస్తున్నారు. తెలివి త‌క్కువ ప్ర‌ధాని అంటూ.. మోడీని దేశం కోసం త‌రిమికొడ‌తామంటూ కేసీఆర్ కోపంతో ఊగిపోతున్నారు.

బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్‌.. దేశ‌వ్యాప్తంగా దాన్ని వ్య‌తిరేకించే పార్టీల‌తో క‌లిసి ప‌నిచేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ‌తంలోనే ఫెడ‌రల్ ఫ్రంట్ అంటూ బీజేపీని వ్య‌తిరేకించే పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైనా కేసీఆర్‌.. మ‌రోసారి ఆ కూట‌మి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నార‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఢిల్లీ వెళ్లేందుకు..
మోడీని దేశం నుంచి త‌రిమి కొట్టేందుకు జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని కేసీఆర్ అంటున్నారు. ఢిల్లీ రాజ‌కీయాల‌పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు. బీజేపీ వ్య‌తిరేక కూట‌మికి ఆయ‌న మ‌రోసారి పావులు క‌దుతుపున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీల‌తో మాట్లాడాన‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

దేశం కోసం క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం త‌ప్పుడు విధానాల‌ను దేశ‌మంతా వివ‌రిస్తామ‌ని ఆ పార్టీపై పోరాటం చేస్తామ‌ని పేర్కొన్నారు. దీంతో బీజేపీ వ్య‌తిరేక కూట‌మి దిశ‌గా కేసీఆర్ వేగంగానే అడుగులు వేస్తున్నార‌ని అనిపిస్తోంది.

ఇప్ప‌టికే మ‌మ‌త‌..
మ‌రోవైపు దేశంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయం తానే అంటూ ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి దూకుడుతో ముందుకు సాగుతున్నారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్త‌రించే ప్ర‌యత్నాల్లో ఉన్నారు. గోవా ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి ఢీ కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎస్పీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఆధ్వ‌ర్యంలో ఆమె ముందుకు సాగుతున్నార‌నే అభిప్రాయాలున్నాయి.

 ఇప్ప‌టికే కాంగ్రెస్‌, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ లాంటి పార్టీల‌తో క‌లిసి బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాట్లు జ‌రిగాయి. కానీ దానికి నేతృత్వం వ‌హించే సామ‌ర్థ్యం కాంగ్రెస్‌కు లేద‌న్న మ‌మ‌తా.. తానే అందుకు స‌రైన వ్య‌క్తిని అని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బీజేపీపై పోరాటానికి మ‌మ‌తా బెన‌ర్జీతో మాట్లాడాన‌ని కేసీఆర్ చెప్తున్నారు. మ‌రి కేసీఆర్‌ను క‌లుపుకొని మ‌మ‌త వెళ్తారా? లేదా కేసీఆర్ మార్గ‌నిర్దేశ‌నంలో ఆమె అడుగులు వేస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఒక‌వేళ బీజేపీ, కాంగ్రెసేత‌ర కూట‌మి ఏర్పాటు చేస్తే దానికి ఎవ‌రు అధ్య‌క్ష‌త వహిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News