అద్వానీని క‌లిసిన మ‌మ‌త‌.. కార‌ణ‌మేంది?

Update: 2018-08-01 10:18 GMT
అసోంలో ఇటీవ‌ల వెల్ల‌డించిన పౌరుల ముసాయిదా జాబితా మీద ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అగ్గిమీద గుగ్గిలం అయిన‌ట్లుగా అవుతున్నారు. ఇప్ప‌టికే అసోం జాతీయ పౌర జాబితాలో 40 ల‌క్ష‌ల పేర్ల‌ను ప‌క్క‌న పెట్టిన వైనం పెను సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది.

దీనిపై మ‌మ‌తా తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు కూడా. ఈ వ్య‌వ‌హారం ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో పాల‌క‌.. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాద ప్ర‌తివాద‌న‌ల‌కు తావిచ్చేలా చేసింది. స‌భ జ‌ర‌గ‌కుండా ప‌లుమార్లు వాయిదాల‌కు కార‌ణ‌మైంది. ఇదిలా ఉంటే.. పౌరుల జాబితాలో 40 ల‌క్ష‌ల మంది పేర్లు లేక‌పోవ‌టంపై మ‌మ‌త కూడా తీవ్ర ఆగ్ర‌హం కావ‌టంతో పాటు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

ఈ ముసాయిదా కార‌ణంగా అంత‌ర్యుద్ధం.. ర‌క్త‌పాతానికి దారి తీస్తుంద‌న్న హెచ్చ‌రిక‌ను కూడా ఆమె చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు మ‌మ‌తా. తాజాగాఆమె బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీతో భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. సొంత పార్టీలోనే అద్వానీని ప‌ట్టించుకునే నాథుడే లేడు. అలాంటిది తాజాగా దీదీ మాత్రం అద్వానీతో భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మోడీ మాట అంటేనే ఇష్ట‌ప‌డ‌ని మ‌మ‌త‌.. తాజాగా అద్వానీని క‌ల‌వ‌టం వెనుక‌.. తాజా ర‌చ్చ విష‌యంలో త‌న వాద‌న‌ను వినిపించ‌ట‌మే కాదు.. మోడీ స‌ర్కారు తీరుపై త‌న‌కున్న అభ్యంత‌రాల్ని.. అసంతృప్తిని వ్య‌క్తం చేసి ఉండొచ్చ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. పార్టీలో మోడీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పే వారికి అద్వానీ పెద్ద దిక్కు అవుతార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. అలాంటి ప్రాధాన్య‌త అద్వానీకి ద‌క్కిన తీరు చూస్తే.. మోడీని కావాల‌నే దీదీ క‌ల‌వ‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. మోడీ దూకుడు విష‌యంపై అసంతృప్తిలో ఉన్న దీదీ.. పెద్దాయ‌న స‌ల‌హాలు కూడా తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఏమైనా.. అద్వానీతో దీదీ భేటీ రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News