దీదీ కొత్త ప్లానింగ్.. కాంగ్రెస్ ను రీప్లేస్ చేయబోతున్నారా?

Update: 2021-12-02 05:35 GMT
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త రాజకీయ ఆటను మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఢిల్లీకి వచ్చిన ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావటం తెలిసిందే. అనంతరం బయటకు వచ్చిన ఆమెను మీడియా పలుకరించిన నేపథ్యంలో..కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారా? అని ప్రశ్నించారు. అందుకు అనూహ్యంగా స్పందించిన మమతా.. ఢిల్లీకి వస్తే సోనియాగాంధీని కలవాల్సిందేనా? అంటూ ప్రశ్నించటం ద్వారా.. కాంగ్రెస్ పార్టీతో తాను కలిసే ప్రసక్తి లేదన్న విషయాన్ని చెప్పేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె మరో కీలక వ్యాఖ్య చేయటం ద్వారా జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీశారు.

మహారాష్ట్ర అధికారపక్షమైన శివసేన.. ఎన్సీపీ నేతల్ని కలిసేందుకు మూడు రోజుల ముంబయి పర్యటనకు వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

యూపీఏ అంటూ ఏమీ లేదన్న ఆమె మాటలకు తగ్గట్లే శరద్ పవార్ సైతం.. ప్రస్తుతం నాయకత్వం సమస్య కాదని.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేయటం కీలకమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మమతా గుర్రు మొత్తం సోనియా మీద కంటే కూడా రాహుల్ మీదనా? అన్న సందేహం వ్యక్తమయ్యేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. రాజకీయాల్లో నిరంతర ప్రయత్నం తప్పనిసరి అని.. ఎక్కువ సమయం విదేశాల్లో ఉండకూడదన్న ఆమె.. రాహుల్ పేరును ప్రస్తావించకుండానే వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే.. మమత ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె ఆలోచనలు చూస్తే.. వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్ని కలిసి ఒక జట్టుగా కలిస్తే.. కేంద్రంలో అధికారంలోకి రావటం కష్టం కాదన్నట్లుగా ఉంది. అయితే.. అదంతా తేలికైన విషయం కాదని చెప్పాలి. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడూ ఏదో ఒక ఎజెండా ఉంటుంది. ఒకరి ఎజెండాతో మరొకరికి పొంతన ఉండదు. అలాంటప్పుడు జాతీయస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.. సాధ్యమా? అన్నది ప్రశ్న.

ఇదే అంశాన్ని కాంగ్రెస్ సైతం తెర మీదకు తీసుకొచ్చింది. తాము జట్టులో లేకుండా బీజేపీని ఓడించటం సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకత్వం పేర్కొంది. తమ పార్టీ సహకారం లేకుండా బీజేపీని ఓడించగలమన్న కల కనడాన్ని మానుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. కాంగ్రెస్ లేకుండా కూటమి కట్టే ప్రయత్నంలో ఉన్న మమత.. యూపీఏ ప్రస్తావన తెచ్చినప్పుడు.. అదెక్కడ ఉందన్న వ్యాఖ్యను చేయటం గమనార్హం. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కూటమి జట్టు కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్న దీదీ.. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసేలా పావులు కదుపుతున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News