త్వరలో నాన్ జాతీయ పార్టీల ముఖ్యమంత్రులతో మమత సమావేశం..

Update: 2022-03-09 08:56 GMT
కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన మహారాష్ట్ర, జార్ఘండ్ సీఎంలను కలిశారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. అయితే బీజేపీ, కాంగ్రెసేతర కూటమిగా ఏర్పడి పోరాడితే ఆయా రాష్ట్రాలకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెబుతూ వచ్చారు.

ఈ క్రమంలో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నేరుగా భేటీ కాకున్నా ఫోన్లో సంప్రదించారు. ఇక తాజాగా మమతా బెనర్జీ ఈ విషయంపై అలర్ట్ అయ్యారు. త్వరలో కేంద్రం చేతిలో వివక్షకు గురవుతున్న ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశం బీజేపీ, కాంగ్రెసేతర కూటమిగా ఏర్పాటు చేయడానికి కలిసివచ్చేవారితోనే ఉంటుందని స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పోరాడేందుకు బలమైన శక్తి కావాలని, అందుకు కాంగ్రెసేతర కూటమి కావాలని మమత నినదిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె కాంగ్రెస్, బీజేపీతో తెగదెంపులు చేసుకున్న ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. అయితే ఒకేసారి రెండు జాతీయ పార్టీలను వ్యతిరేకిస్తున్న మమత ఈ సమావేశాన్ని సక్సెస్ చేస్తారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీని కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఎవరికి వారే అధినేతగా కొనసాగుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్  మినహా మహారాష్ట్రలో కాంగ్రెస్తోనే శివసేన అధికారంలో ఉంది. అటు తమిళనాడు స్టాలిన్ సైతం కాంగ్రెస్ పొత్తు వీడే అవకాశం లేదు. ఇక ఏపీ సీఎం జగన్ కేంద్రంతో సన్నిహితంగానే ఉంటున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం ఆప్ సొంతంగా కేంద్రానికి ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు.

అంటే ఒకే ఒక్క కేసీఆర్ తో మమత సమావేశం అవుతారా..? అనే చర్చ సాగుతోంది. అయితే బీజేపీ విధానాలపై పోరాడేందుకు కలిసి రావాలని మమత పిలపుకు ఎందరు స్పందిస్తారో చూడాలి.

ఇక కాంగ్రెస్ లేకుండా తాము కూటమి ఏర్పాటు చేయలేమని శివసేన వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఇద్దరు, ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉంటుందా..? అని చర్చించుకుంటున్నారు. కానీ తొందర్లోనే కేసీఆర్, స్టాలిన్, నవీన్ పట్నాయక్ లకు ఆహ్వానాలు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.

కానీ ఇందులో కేసీఆర్ తప్ప మిగతా ఎవరూ మమత సమావేశానికి హాజరయ్యేందుకు సాహాసించే అవకాశం లేనట్లే తెలుస్తోంది.


Tags:    

Similar News