గో సంరక్షకులపై మమత మాటలు విన్నారా?

Update: 2016-09-13 04:25 GMT
గో సంరక్షణ అంశం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో.. తమ రాష్ట్రంలో అలాంటి పనులుచేస్తే సహించేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి - తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఈ మేరకు గో సంరక్షులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే, గో సంరక్షణ పేరుతో దాడులకు దిగితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పనులకు గో సంరక్షణను వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ విషయాలపై సీరియస్ గా స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. " శాఖాహారులు కాయగూరలు తింటారు, మాంసాహారులు మాంసం తింటారు.. ఎవరు ఏమి తినాలో - ఏమి తినకూడదో చెప్పే హక్కు గో సంరక్షులకు ఎవరిచ్చారు? అసలు ఈ విషయాలపై కండిషన్స్ పెట్టడానికి వీరెవరు? ఇలాంటి చెత్తపనులు మానుకోవాలని నేను ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.. ఎవరి మతం వారికి గొప్ప - ఆ మతాన్ని సంరక్షించుకునే హక్కు వారికి ఉంది కానీ.. ఆ మతం చాటున దాడులకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు" అని మమతా వ్యాఖ్యానించారు.

కాగా.. గో సంరక్షకులపై గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గో సంరక్షకుల్లో 80 శాతానికి పైగా సంఘ విద్రోహశక్తులున్నాయని గతంలో మోడీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ ఎమ్) లీగల్ నోటీసులు కూడా పంపేందుకు సిద్ధపడింది!
Tags:    

Similar News