శివ ఈజ్ క‌మింగ్‌.. రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేస్తున్న మమత..!

Update: 2021-03-04 15:30 GMT
రాముడిని రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చి ద‌శాబ్దాలు దాటుతోంది. బీజేపీ ఎత్తుకునే నినాదాల్లో అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది 'జై శ్రీరామ్'. హిందూత్వానికి పేటెంట్ తమదేనని పరోక్షంగా ప్రకటిస్తుంటారు ఆ పార్టీ నేతలు. ఈ బ్యాక్ డ్రాప్ లో కమలదళం రచించే వ్యూహాలకు ఎలా స‌మాధానాలు చెప్పాలో తెలియ‌క ప్ర‌త్య‌ర్థులు త‌ల ప‌ట్టుకుంటారంటే అతిశ‌యోక్తి కాదు. రామ‌రాజ్యం నినాదంతో రాజ‌కీయాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా దేశంలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

అయితే.. ముళ్లును ముళ్లుతోనే తీయాల‌నే సూత్రాన్ని పాటిస్తున్నార‌ట మ‌మ‌తా బెన‌ర్జీ. హిందూత్వాన్ని భుజానికెత్తుకుని ప్ర‌త్య‌ర్తుల‌పై దాడిచేసే బీజేపీపై.. అదే హిందూత్వ‌తో స‌మాధానం చెప్పాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు వ్యూహాలు కూడా రచించార‌ని ప్ర‌చారం సాగుతోంది. దీని ప్ర‌కారం.. లార్డ్ శివ నినాదాన్ని మ‌మ‌త ఎత్తుకోబోతున్నార‌ని స‌మాచారం.

హిందూత్వ విష‌యంలో తాము కూడా ముందే ఉన్నామ‌ని చెప్పేందుకు మ‌మ‌త ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా మ‌హాశివ‌రాత్రి రోజునే తాను నామినేష‌న్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి కూడా మ‌మ‌త బ‌రిలో దిగ‌బోతున్న విష‌యం తెలిసిందే. అక్క‌డే త‌న ఎన్నిక‌ల కార్యాల‌యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు దీదీ.

బెంగాల్లో ఇదివ‌ర‌కు నామ‌మాత్రంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు అధికారం కోసం పోటీ ప‌డుతుండ‌డం విశేషం. మ‌మ‌త‌ను ఓడించి బెంగాల్లో కాషాయ జెండా ఎగ‌రేయాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ ఇవ్వొద్ద‌ని డిసైడ్ అయిన మ‌మ‌త‌.. వారి రాజ‌కీయాల‌కు విరుగుడుగా హిందూత్వ‌ను కూడా ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో శివ నిన‌దాన్ని ఎత్తుకోబోతున్నార‌ని స‌మాచారం. అంతేకాకుండా.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీకి ప‌ట్టున్న ప్రాంతాల్లో పాద‌యాత్ర కూడా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. మ‌రి, మ‌మ‌త 'జై శివ' నినాద‌ వ్యూహం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    

Similar News