అక్కడ అంతే.. సీబీఐ ఆఫీసు ఎదుట 6 గంటల పాటు సీఎం నిరసన!

Update: 2021-05-18 01:32 GMT
పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత ఉద్దేశం మంచిదే. కానీ.. అన్ని సందర్భాల్లోనూ ఆ సామెత సూట్ కాదన్న విషయాన్ని ప్రధాని మోడీ మర్చిపోతున్నారా? ఆయన మనసు పడిన తర్వాత.. అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యాక రాకుండా పోవటం చాలా తక్కువ రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. చేతి వరకు వచ్చి చేజారిన కర్ణాటక రాష్ట్ర పగ్గాల విషయంలో.. మోడీషాలు కదిపిన పావులు.. చివరకు తమ వారిని అధికారంలోకి కూర్చున్న తర్వాత కానీ విశ్రమించలేదు. అన్ని రాష్ట్రాలు కర్ణాటక మాదిరి ఉండవు కదా? ఆ విషయాన్ని మోడీ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కాదు.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని రాజకీయాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజకీయం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే.. మిగిలిన ముఖ్యమంత్రులకు మమత భిన్నం. మహా మొండి మనిషి అయిన ఆమె.. మిగిలిన అధినేతలకు భిన్నంగా రోడ్డు మీదకు వచ్చి పోరాడటం షురూ చేస్తారు. తాను ముఖ్యమంత్రి అన్న భావన పక్కన పెట్టి.. ఒక సగటు ఉద్యమకారిణి మాదిరి ప్రత్యర్థుల మీద పోరాడతారు. పట్టు కోసం మోడీకి మించిన మొండితనం ఆమె సొంతం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు కోసం మోడీ అండ్ కో చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ఇంత చేసిన తర్వాత కూడా మమతకు డబుల్ సెంచరీ దాటేసేలా స్థానాల్ని అప్పజెప్పారు. ఇక్కడితో బెంగాల్ మీద మోడీ ఫోకస్ తగ్గుతుందని భావించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా కేంద్రంలోని మోడీ సర్కారు ఎంతలా డ్యామేజ్ అయ్యింది.. ఈ రోజున దేశంలో ఇంత భారీగా సెకండ్ వేవ్ వ్యాపించటానికి కారణం ఎన్నికలే అన్న మాట ప్రతి ఒక్కరి నోట వినిపించటం తెలిసిందే. బెంగాల్ లో దీదీ సర్కారు కొలువు తీరిన వేళ.. అక్కడి రాజకీయాల్ని స్థానికంగా వదిలేస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండటంతో పాటు.. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

స్వతంత్ర వ్యవస్థగా దానికున్న పేరు ప్రఖ్యాతులు డ్యామేజ్ అయ్యేలా బెంగాల్ లో సీబీఐ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో తాజాగా బెంగాల్ మంత్రులు ఇద్దరిని (ఫిర్హాద్‌ హకీమ్, సుబ్రతా ముఖర్జీ) సీబీఐ అధికారులు అరెస్టు చేయటం గరంగరంగా మార్చింది. వీరితో పాటు దీదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. మాజీ మంత్రి సోవన్ ను అదుపులోకి తీసుకోవటంపై సీఎం మమత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

సీఎంగా ఉన్న ఆమె సీబీఐ కార్యాలయం ఎదుటకు వెళ్లి.. దాదాపు ఆరు గంటల పాటు నిరసన వ్యక్తం చేయటం సంచలనంగా మారింది. రాజకీయ వాతావరణాన్ని హాట్ గా మార్చేసిన ఈ ఉదంతం చివరకు స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి బెయిల్ ఇవ్వటంతో విషయం ఒక కొలిక్కి వచ్చింది. అయితే.. రాత్రి హైకోర్టు వీరి బెయిల్ కు స్టే ఇచ్చింది. దీంతో విషయం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఏమైనా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బెంగాల్ రాజకీయం ఒక కొలిక్కి వచ్చిందని భావించినా.. కేంద్రంలోని మోడీ సర్కారు పుణ్యమా అని తాజా పరిస్థితి నెలకొందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల్ని తన అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని స్పీకర్ ప్రశ్నిస్తున్నారు. అయితే.. సీబీఐ అరెస్టు చేసిన నేతలకు సంబంధించిన ఉత్తర్వుల్ని గతంలో గవర్నర్ ఇవ్వటం గమనార్హం.

ఏమైనా.. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి.. నిరసన చేస్తున్న వైనం.. తీవ్రంగా మండిపడుతున్న తీరు చూసిన తర్వాతైనా.. మోడీషాలు కాస్త వెనక్కి తగ్గితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోయిన చోట వెతుక్కోవటం మంచిదే కానీ.. మరీ ఇంత తొందర పనికి రాదన్న విషయాన్ని మోడీషాలకు అర్థమయ్యేలా ఎవరు చెబుతారు. ఇలాంటి చర్యలతో మమత మీద బెంగాలీల్లో ఉన్న ఇమేజ్ మరింతలా పెరుగుతుందన్న లాజిక్ ను మోడీ అండ్ కో ఎందుకు మిస్ అవుతున్నట్లు? ప్రజల చేత తాజాగా ఎంపికైన ముఖ్యమంత్రి రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసే వరకు వెళ్లటం దీదీ కంటే కూడా మోడీకే ఎక్కువ దెబ్బ అవుతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News