నేతాజీ విగ్రహ ఆవిష్కరణ వేళ.. నేతాజీ మిస్టరీ పై మమత సూటిప్రశ్న

Update: 2022-01-24 04:08 GMT
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర సమరయోథుడు.. భారతీయులంతా ఎంతో ప్రేమించే.. అభిమానించే సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల వేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవటం.. అందుకు తగ్గట్లే.. ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏదైనా సాధించగలమన్న నేతాజీ నినాదాన్నిప్రేరణగా తీసుకోవాలన్నారు. బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వేళ.. ఎంతో హ్యాపీగా ఉన్న మోడీ సర్కారుకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

తాము అధికారంలోకి వస్తే నేతాజీ మిస్టరీకి సంబంధించిన వివరాల్ని బయటపెడతామని.. రహస్యాన్ని రివీల్ చేస్తామంటూ బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొనటం తెలిసిందే. మరి..అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లు అవుతుంది? నేతాజీ మిస్టరీపై సమాధానం చెప్పరేం? అంటూ సూటిగా సంధిస్తున్న ప్రశ్న ఇప్పుడు మోడీ సర్కారుకు కొత్త గుబులు పుట్టేలా చేస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఆమె సూటిగా సంధించిన ప్రశ్నలు అలా ఉండటమే దీనికి కారణం.

రిపబ్లిక్ డే నాడు తమ రాష్ట్ర శకటానికి అనుమతిని నిరాకరించటంపై మమత తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు.ఇండియాగేట్ వద్ద నేతాజీ సుభాష్  చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్న కేంద్రం.. అదే మహాత్ముడిపై తమ రాష్ట్రం రూపొందించిన శకటాన్ని ఎందుకు తిరస్కరించిందని ప్రశ్నించారు. తమ శకటాన్నితిరస్కరించటానికి కారణం ఏమిటో కూడా వెల్లడించలేదన్నారు.

నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన శౌర్యానికి.. పరాక్రమానికి అద్దం పట్టేలా శకటాన్ని తీర్చి దిద్దామని.. దాన్ని కేంద్రం నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కారు ఇరుకున పడేలా కొన్ని ప్రశ్నల్ని సంధించారు. నేతాజీ మిస్టరీపై గతంలో ఇచ్చిన హామీ మాటేమిటి?అని ప్రశ్నించారు. తాము అధికారంలో వచ్చాక.. నేతాజీ మిస్టరీని ఛేదిస్తామని బీజేపీ చెప్పిందని.. ఆ ప్రమణాన్ని పూర్తిగా మర్చిపోయారన్నారు.

అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఈ విషయంలో ఎందుకు ముందుడుగు పడలేదు? అని ప్రశ్నించారు. తమ రాష్ట్రం తరఫున నేతాజీకి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ప్రజలందరికి అందుబాటులో ఉండేలా డిజిటలైజ్ చేశామన్నారు. అంతేకాదు.. అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ద స్మారక జ్యోతిలో విలీనం చేయటం ఏమిటంటూ తప్పు పట్టారు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు.మొత్తానికి బోస్ మిస్టరీని తాము అధికారంలోకి వచ్చినంతనే బయటపెడతామన్న బీజేపీ హామీని గుర్తు చేయటం ద్వారా.. ఆ పార్టీనేతల్ని ఇరుకున పడేసేలా చేశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News