అనారోగ్యంపై హైకోర్టుకెక్కిన సామాన్యుడు

Update: 2018-10-04 06:52 GMT
అత‌డో మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి. రెక్కాడితేగానీ డొక్కాడ‌దు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా న‌ల్ల‌బిల్లి అత‌డి స్వ‌స్థ‌లం. కుటుంబ‌మే అత‌డికి స‌ర్వ‌స్వం. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్న అత‌డిపై విధి చిన్న‌చూపు చూసింది. తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది. ఆస్ప‌త్రికెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకుంటే.. తాను అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తేలింది. చికిత్స చేయించుకోవాలంటే ఏడాది రూ.కోటి ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలిసింది. పిడుగులాంటి ఆ వార్త‌కు అత‌డు నిశ్చేష్టుడ‌య్యాడు. ఆపై వైద్యం కోసం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికెళ్తే.. విదేశాల నుంచి ఔష‌ధాలు తెప్పిస్తేగానీ ఆ వ్యాధికి తాము చికిత్స అందించ‌లేమంటూ చేతులెత్తేశారు వైద్యులు.

అత్యంత అరుదైన గాచ‌ర్స్ వ్యాధితో న‌ల్ల‌బిల్లి వాసి బాధ‌ప‌డుతున్నాడు. ఎంజైమ్ లోపంతో పుట్ట‌డం ఈ వ్యాధి సంభ‌విస్తుంది. బాధితులు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. కీళ్ల నొప్పులు విప‌రీతంగా ఉంటాయి. కాలేయం - మూత్రపిండాల మార్పిడి తరహాలోనే.. ఇలాంటి వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంజైమ్ మార్పిడి చేయాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని ఔష‌ధాల‌తో వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచ‌వ‌చ్చు. అయితే, ఆ ఔష‌ధాలు అత్యంత ఖ‌రీదైన‌వి. వాటిని కొనే స్థోప‌త న‌ల్ల‌బిల్లి వాసికి లేదు. దీంతో త‌న ప్రాణం నిల‌బెట్టాల‌ని వేడుకుంటూ హైకోర్టును బాధితుడు ఆశ్ర‌యించాడు. విదేశాల నుంచి మందులు తెప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. అంతేకాదు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో త‌న‌లాంటి వ్యాధిగ్ర‌స్తుల‌కు వైద్యం అంద‌క‌పోవ‌డాన్ని ప్ర‌శ్నించాడు. దాన్ని కేంద్రం - రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఫ‌ల్యంగా పేర్కొన్నాడు. త‌న ఆరోగ్యం మ‌రింత దిగ‌జారితే దానికి బాధ్య‌త వ‌హించాల్సింది ప్ర‌భుత్వ యంత్రాగ‌మేన‌ని సూచించాడు.

బాధితుడి పిటిష‌న్ నేప‌థ్యంలో హైకోర్టు స్పందించింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో హుటాహుటిన ప్ర‌భుత్వం స్పందించింది. నివేదిక స‌మ‌ర్పించాల్సిదిగా వైద్యుల‌కు సూచించింది. ఏటా దాదాపు రూ.కోటి ఖ‌ర్చు చేస్తేనే బాధితుడికి చికిత్స అందించ‌గ‌ల‌మంటూ వైద్యులు త‌మ నివేదిక‌లో పేర్కొన్నారు. అయితే, ఓ వ్య‌క్తిపై ఇంత‌టి అధిక‌మొత్తం ఖ‌ర్చు చేయ‌డం ప్ర‌భుత్వానికి సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. న‌ల్ల‌బిల్లి వాసి విష‌యంలో తామేమీ చేయ‌లేమంటూ త్వ‌ర‌లోనే హైకోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఈ విష‌యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!


Tags:    

Similar News