విడాకులు తీసుకున్న మహిళతో వివాహం.. తర్వాత ఏం చేశాడంటే?

Update: 2020-11-06 17:30 GMT
విడాకులు తీసుకున్న మహిళను తాను ఒక ‘రా’ ఏజెంట్ అని.. సీక్రెట్ సర్వీస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అంటూ ఒక వ్యక్తి నమ్మించాడు. పెళ్లి చేసుకొని ఆమె బంగారు నగలను అపహరించాడు. సినిమా ట్విస్ట్ లను తలపించేలా జరిగిన ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఎం. ఆనందవర్ధన్ (39)కు వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాదిన్నర క్రితం నార్సింగి ఠాణా పరిధిలోని నెక్నాపూర్ ప్రాంతానికి చెందిన మహిళతో పరిచయమైంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాను కూడా విడాకులు తీసుకున్నట్టు నమ్మించాడు. రా ఏజెంట్ అని మోసం చేశాడు. బెంగళూరు చిరునామాతో ఓ ఐడీకార్డ్ చూపించాడు. విడాకులు తీసుకున్నట్టు నకిలీ కాపీని చూపించి పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం బీరువాలోని 50 తులాల బంగారం, ఓ ఫైనాన్స్ కంపెనీలో 8 లక్షలు తీసుకొని జల్సాలు చేశాడు. భార్య అడిగితే చోరీ జరిగిందని నాటకమాడాడు. భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రా ఏజెంట్ అంటూ రికవరీ అయ్యాయని బ్యాంకులో డబ్బు వేశారని ఓ నకిలీ చెక్ చూపించాడు.

డబ్బు విషయమై రోజురోజుకు భార్య ఒత్తిడి తేవడంతో వెళ్లి తెస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. ఆ తర్వాత నీ భర్త చనిపోయాడని వేరే వ్యక్తుల ద్వారా చెప్పించాడు. కరోనా కారణంగా డెడ్ బాడీ ఇవ్వలేమంటూ వారు భార్యకు చెప్పారు.

భార్యకు అనుమానం వచ్చి తాను మోసపోయినట్లు గమనించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు వచ్చిన భర్తను తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. బంగారం, డబ్బుల కోసమే ఆమెను పెళ్లి చేసుకొని ఇంత కథ నడిపినట్టు తెలిపాడు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Tags:    

Similar News