12 ఏళ్లు వెయిట్ చేసి చంపేశాడు

Update: 2015-12-22 04:21 GMT
తన తండ్రిని చంపిన హంతకుడిపై ఒక యువకుడు పగ తీర్చుకున్న వైనం ఉత్తరప్రదేశ్ లో తాజాగా సంచలనమైంది. తనకు పన్నెండేళ్ల వయసులో తన తండ్రిని చంపిన హంతకుడ్ని ఏమీ చేయలేక.. అతడ్ని ఎలాగైనా మట్టుబెట్టాలని పగతో రగిలిపోయిన ఒక యువకుడు చివరకు తన పగ తీర్చుకున్నాడు. ఇందుకోసం దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని చంపిన హంతకుడ్ని హత్య చేసి.. అతడ్ని 12 ముక్కలు చేశాడు. తాజాగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. హత్య చేసింది తానేనంటూ నవ్వుతూ బదులివ్వటం ఇప్పుడు పలువురికి షాకింగ్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఆలమ్ ఖాన్ కు ఇప్పుడు 24 ఏళ్లు. సరిగ్గా అతగాడికి 12 ఏళ్లు ఉన్నప్పుడు అతని తండ్రిని మహ్మద్ రైజ్ హత్య చేశాడు. ఆలమ్ తండ్రిని హత్య చేసింది ఎవరో కాదు.. తండ్రి స్నేహితుడే. తన తండ్రిని చంపింది ఎవరో తెలిసినా చిన్న వయసులో ఏమీ చేయలేనని ఊరుకుంటూ.. మనసులో మాత్రం పగను రోజురోజుకూ పెంచుకుంటూ పోయాడు. ఇందుకోసం 12 ఏళ్లు వెయిట్ చేశాడు. తాజాగా అవకాశం దొరకటంతో తన స్నేహితులతో కలిసి ఆలమ్.. తన తండ్రిని హత్య చేసిన హంతకుడ్ని చంపేశాడు. అతడి శరీరాన్ని 12 ముక్కలు చేశాడు. వాటిని మూటగట్టి గంగానది ఒడ్డున పడేశాడు.

ఈ మూటను గుర్తించిన పోలీసులు.. హత్యకు గురైన వ్యక్తి తల మాత్రం దొరకలేదు. అయితే.. ఛాతీ మీద ఉన్న కుట్ల ఆధారంగా హత్యకు గురైన వ్యక్తిని గుర్తించారు. అనంతరం ఈ కేసు మీద దర్యాఫ్తు చేసిన పోలీసులు ఆలమ్ ను అదుపులోకి తీసుకున్నారు. తాను చేసిన నేరాన్ని ఆలమ్ ఒప్పుకొన్నాడు. పన్నెండేళ్లుగా పగతో రగిలిపోయి.. చివరకు ప్రతీకారం తీర్చుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News