దేవ‌త‌ ప్ర‌స‌న్నం కోసం త‌ల్లిని బ‌లిచ్చేశాడు!

Update: 2017-04-10 11:04 GMT
విన‌డానికి కాస్తంత భ‌యంక‌రంగా ఉన్నా... ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే చేసిన త‌ప్పును తొలుత బుకాయించాల‌ని చూసినా... పోలీసులు రంగంలోకి దిగ‌డంతో ఈ దుర్మార్గానికి పాల్ప‌డిన యువ‌కుడు త‌న త‌ప్పును ఎట్ట‌కేల‌కు ఒప్పేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా బ‌మ‌గ్రామ్‌ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న... భ‌క్తి భావం మూఢ విశ్వాసంగా మారితే ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చెబుతోంది.

ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... బ‌మ‌గ్రామ్ కు చెందిన యువ‌కుడు నారాయ‌ణ మ‌హ‌తో... కాళీ మాత భ‌క్తుడిగా అక్క‌డి వారంద‌రికీ తెలుసు. కాళీ మాత అంటే ప్రాణ‌మిచ్చేంత మేర భ‌క్తిని పెంచుకున్న నారాయ‌ణ‌... ఏకంగా త‌న ఇంటిలోనే కాళీ మాత‌కు ఆల‌యం క‌ట్టేసుకున్నాడు. నిత్యం ఇంటిలోనే కాళీ మాత‌కు పూజ‌లు చేసే నారాయ‌ణ‌... ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు కాళీ మాత క‌ల‌లో క‌నిపిస్తుంటుంద‌ని చెబుతూ ఉండేవాడు. కుమారుడు కాళీ మాత‌పై భ‌క్తి భావాన్ని పెంచుకుంటున్నాడ‌ని సంతోషించిన నారాయ‌ణ త‌ల్లి పులి మ‌హ‌తో... ఇంటిలోని కాళీ మాత ఆల‌యాన్ని నిత్యం శుభ్రం చేస్తూ ఉండేవారు.

ఈ క్ర‌మంలో గ‌త శుక్ర‌వారం ఉద‌యం కాళీ మాత ముందు మోకాళ్ల‌పై కూర్చుని శుభ్రం చేస్తున్న పులి మ‌హ‌తో త‌ల‌పై ప‌దునైన క‌త్తి వేటు ప‌డింది. ఆ దెబ్బ‌కు పులి మ‌హ‌తో త‌ల ఆమె మొండెం నుంచి వేరైంది. పులి మ‌హ‌తో త‌ల‌పై క‌త్తితో దాడి చేసింది ఎవ‌రో కాదు... స్వ‌యానా ఆమె కుమారుడు నారాయ‌ణ మ‌హ‌తోనే. అయినా సొంత త‌ల్లి త‌ల‌నే న‌రికేంత‌గా నారాయ‌ణ ఎలా మారిపోయాడు?  కాళీ మాత‌పై ఉన్న భ‌క్తిభావం కాస్త మూఢ విశ్వాసంగా మార‌డంతోనే నారాయ‌ణ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. అప్ప‌టిదాకా త‌ల‌లో నాట్య‌మాడుతున్న మూఢ భ‌క్తి ఎలా చెబితే అలా విన్న నారాయ‌ణ‌... క‌ళ్ల ముందు త‌ల్లి శ‌వం చూడ‌టం, ఆ దారుణానికి తానే ఒడిగ‌ట్టాన‌న్న విష‌యం తెలిసేస‌రికి ఒక్క‌సారిగా మ‌త్తు వ‌దిలింది.

త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు అప్ప‌టిక‌ప్పుడు ఓ నాట‌కం ర‌చించుకున్న నారాయ‌ణ స‌మీపంలో ఉన్న త‌న అన్న ఇంటికి ప‌రుగు పెట్టాడు. కాళీ మాత విగ్ర‌హం ముందు అమ్మ ఆత్మ‌హ‌త్య  చేసుకుందంటూ ఓ క‌ట్టు క‌థ చెప్పాడు. దీంతో ప‌రుగున అక్క‌డికి వెళ్లి ప‌రిశీలిస్తే... త‌ల్లి మొండెం నుంచి ఆమె త‌ల వేర‌వ‌డ‌మే కాకుండా అల్లంత దూరాన ప‌డి ఉన్న విష‌యాన్ని గ్ర‌హించి అనుమానం వ‌చ్చిన నారాయ‌ణ అన్న పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నారాయ‌ణ‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే... అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. క‌ల‌లోకి వ‌చ్చిన కాళీ మాత... కుటుంబం బాగుప‌డాలంటే క‌న్న త‌ల్లిని త‌న‌కు బ‌లి ఇవ్వాల‌ని చెప్పింద‌ని, అందుకే తాను ఈ ఘోరానికి పాల్ప‌డిన‌ట్లు నారాయ‌ణ ఒప్పుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News