కాఫీలో చికెన్ పీస్.. జొమాటోకు గుడ్బై చెప్పిన ఢిల్లీ వాసి

Update: 2022-06-05 01:30 GMT
కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ డెలివరీ లు చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా నగరాల్లో ఉండే యువత వండుకోవడానికి టైం లేక ఎక్కువగా టేక్ అవుట్లు తీసుకుంటారు. పెళ్లైన వారు కూడా వీకెండ్లో వంట ఏం చేస్తాంలే అని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అలా ఓ జంట జొమాటో ద్వారా కాఫీ ఆర్డర్ చేసింది. ఆర్డర్ డెలివరీ కాగానే వాహ్వా.. కాఫీ అంటూ భార్యాభర్తలిద్దరు హాయిగా తాగేశారు. కానీ చివరలో కాఫీ వాళ్లకు షాక్ ఇచ్చింది.

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వంటగది ముఖం చూడ్డమే మానేశారు. టీ, కాఫీ ల నుంచి బిర్యానీ, ఐస్క్రీమ్.. చివరకు సలాడ్ కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీకెండ్స్లో ఫుడ్ డెలివరీ యాప్స్కు మామూలు డిమాండ్ ఉండదు. కానీ ఆర్డర్ చేసిన ప్రతిసారి నాణ్యత గల ఆహారమే రాదు. కొన్నిసార్లు కొంత మంది కస్టమర్లకు వింత అనుభవాలు జరుగుతుంటాయి. అలాంటి ఎక్స్పీరియన్సే ఓ దిల్లీ జంటకు ఎదురైంది.

ఢిల్లీకి చెందిన సుమిత్ తనకు.. తన భార్య కోసం జొమాటో ద్వారా థర్డ్ వేవ్ ఇండియా నుంచి కాఫీ ఆర్డర్ చేశాడు. క్షణాల్లో ఇంటి ముందు వాలిన కాఫీని ఇద్దరు తాగారు. కానీ చివరి సిప్లో వారికి చికెన్ ముక్క వచ్చింది. కాఫీలో చికెన్ రావడమేంటని సుమిత్ ఆగ్రహానికి లోనయ్యారు. తన భార్య శాకాహారి కావడంతో సదరు కాఫీ షాప్ యాజమాన్యంపై అసహనానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. జొమాటో, థర్డ్ వేవ్ ఇండియాలను ట్యాగ్ చేశాడు.

దెబ్బకు దిగొచ్చిన జొమాటో సారీ చెప్పి.. ప్రొ మెంబర్ షిప్ ఉచితంగా ఇస్తామని ఆఫర్ చేసింది. తప్పు చేయడమే గాక.. దాన్ని కప్పిపుచ్చికోవడానికి ఆఫర్లిస్తారా అంటూ సుమిత్ జొమాటో పై మండిపడ్డారు. ఇలాంటి ఆఫర్లతో మీరు నన్ను కొనలేరు.. ఈరోజు తో జొమాటోకు నాకు ఉన్న బంధం ముగిసిందంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో జొమాటో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ మేడ్ కాఫీలో చికెన్ రావడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనపై థర్డ్ వేవ్ ఇండియా కాఫీ షాప్ స్పందించకపోవడం గమనార్హం.
Tags:    

Similar News