వివాదంలో చిక్కుకున్న కల్వకుర్తి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే

Update: 2019-09-16 05:45 GMT
కల్వకుర్తి ఎమ్మెల్యే.. టీఆర్ ఎస్ నేత జైపాల్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన కారు ఒక వ్యక్తిని ఢీ కొన్న ఉదంతంలో ఒకరు మృతి చెందారు. కారు ఢీ కొట్టి వ్యక్తి చనిపోతే.. కనీసం ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయిన వైనంపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై నిరసనగా ఆందోళనను నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో ఎమ్మెల్యే జైపాల్ ప్రయాణిస్తున్న వాహనం ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. స్థానికంగా భాష్యం స్కూల్లో మేస్త్రీగా పని చేస్తున్న జగన్ మృతి చెందారు. కారు ప్రమాదానికి గురై.. వ్యక్తి మరణించిన విషయాన్ని గుర్తించిన వెంటనే.. కారు వదిలేసి ఎమ్మెల్యే అండ్ కో వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు కారును డ్రైవ్ చేస్తున్నది ఎమ్మెల్యేనా?  ఆయన డ్రైవరా? అన్న విషయం మీద క్లారిటీ రావటం లేదు. ప్రమాదం జరిగి.. ఒకరు మరణించిన తర్వాత వారి గురించి తనకేం పట్టనట్లుగా వెళ్లిపోయిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. ఏడాది క్రితం ఇదే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఒక టిప్పర్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో సేఫ్ గా బయటపడ్డారు. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిసిన నేత కూడా ఈ తరహాలో ఘటనాస్థలం నుంచి వెళ్లిపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. 
Tags:    

Similar News