తెలీక మ‌సాజ్ చేస్తే ప్రాణ‌మే పోయింది

Update: 2017-05-02 09:30 GMT
ఏదో చేయ‌బోతే మ‌రేదో జ‌రిగింది. నొప్పి త‌గ్గుతుంద‌ని చేసిన మ‌సాజ్ ఏకంగా ప్రాణాలు పోయిన వైనమిది. తెలిసీ తెలియ‌ని అంశాల మీద‌.. త‌మ‌కున్న మిడిమిడి అవ‌గాహ‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తే ఎలాంటి విప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న విష‌యం తాజా ఉదంతం గురించి తెలిస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కాలు నొప్పితో బాధ ప‌డుతున్న  కొడుకు బాధ‌ను త‌ట్టుకోలేని ఒక త‌ల్లి.. ఉప‌శ‌మ‌నం కోసం కాస్తంత మ‌సాజ్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఏకంగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం ఇప్ప‌డు షాకింగ్ గా మారింది.

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల  యువ‌కుడు ఒక‌రు ఏడాది క్రితం బ్యాడ్మింట‌న్ ఆడుతూ ప‌డిపోయారు. దీంతో.. అత‌ని ఎడ‌మ కాలు విరిగింది. చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా అక్క‌డి డాక్ట‌ర్లు క‌ట్టు క‌ట్టారు. అయితే..కాలు నొప్పి త‌గ్గ‌క‌పోగా.. ఆ ప్రాంతంలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి నొప్పి ఎక్కువైంది. నొప్పితో విల‌విల‌లాడుతున్న కొడుక్కి కాస్తంత ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు దెబ్బ త‌గిలిన ప్రాంతంలో కాస్త మ‌సాజ్ చేసింది.

దీంతో అప్ప‌టివ‌ర‌కూ బాగానే ఉన్న కొడుకు ఒక్క‌సారిగా స్పృహ త‌ప్పిప‌డిపోవ‌టంతో షాక్ తిన్న ఆ త‌ల్లి.. వెంట‌నే అత‌డ్ని ఎయిమ్స్‌కు హుటాహుటిన త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే ఆ యువ‌కుడు మ‌ర‌ణించిన‌ట్లుగా వైద్యులు వెల్ల‌డించారు. ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. కాలిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ప్ప‌డు మ‌సాజ్ చేయ‌టంతో.. అది కాస్తా ఊపిరితిత్తుల దాకా చేరి ప్రాణం పోయిన‌ట్లుగా వైద్యులు గుర్తించారు. తెలిసి తెలియ‌క చేసిన ప‌నికి త‌న చేతుల‌తోనే త‌న కొడుకును చంపుకున్న వైనంతో ఆ త‌ల్లి క‌న్నీరు మున్నీరైంది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News