రీల్ కాదు రియ‌ల్‌:సెక్స్ వ‌ర్కర్ ను ప్రేమించాడు

Update: 2017-07-08 04:41 GMT
సెక్స్ వ‌ర్కర్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాడొక‌డు. ఆమెను పెళ్లాడ‌టానికి ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తాడు. ఇదంతా ఆ మ‌ధ్య‌న టాలీవుడ్ లో విడుద‌లైన రీల్ ముచ్చ‌ట‌. దాదాపు ఇలాంటి ఉదంత‌మే తాజాగా రియ‌ల్ గా జ‌రిగింది. ప్రేమించే మ‌న‌సు వ్య‌క్తి ఎవ‌రు? ఏం చేస్తుంటాడు? అన్న‌ది అస్స‌లు చూడ‌దంటారు. దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుందీ ఉదంతం.

రెండేళ్ల క్రితం నేపాల్ లో చోటు చేసుకున్న భారీ భూకంపం ఆ బుజ్జి దేశాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఆ విప‌త్తు బారిన ప‌డి.. బ‌తుకుదెరువు కోసం ఢిల్లీకి వ‌చ్చిన ఒక నేపాలీని ఒక వ్య‌క్తి మోసం చేసి వేశ్యాగృహానికి అమ్మేశాడు. ఆ న‌ర‌క‌కూపంలో దిగ‌బ‌డిన 27 ఏళ్ల అమ్మాయిని ఢిల్లీకి చెందిన ఒక వ్య‌క్తి తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ్డాడు.

అప్ప‌టి నుంచి ఆమె కోసం వేశ్యా గృహానికి రోజూ వ‌చ్చేవాడు. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్య‌వ‌హారం.. తాజాగా ఆమెను పెళ్లాడాల‌ని స‌ద‌రు వ్య‌క్తి భావించాడు. త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పాడు. ఆమె కూడా అత‌గాడి ప్రేమ‌కు ఫ్లాట్ అయ్యింది. అయితే.. వేశ్యా గృహం నుంచి బ‌య‌ట‌కు రావ‌టం అసాధ్య‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన ఆ యువ‌కుడు.. ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ ను ఆశ్ర‌యించాడు.

వేశ్యా గృహంలో ఉన్న మ‌హిళ‌ను పెళ్లాడాల‌ని అనుకున్నాన‌ని.. త‌న‌కు సాయం చేయాల‌ని కోరాడు. ఇంకేముంది.. పోలీసుల రంగ‌ప్ర‌వేశంతో ఈ ఇద్ద‌రు ప్రేమికులు ఒక్క‌టి అయ్యారు. రీల్ క‌థ‌ను త‌ల‌పించే ఈ రియ‌ల్ క‌థ ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News