హంటా వైరస్..చైనాను కరోనా మాదిరే వణికిస్తోందా?

Update: 2020-03-25 03:30 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్- 19 వైరస్ ప్రభావం ఇంకా తగ్గనే లేదు. అప్పుడే కరోనా వైరస్ పుట్టిన చైనాలోనే మరో వైెరస్ పంజా విసిరేందుకు ఎంట్రీ ఇచ్చిందా? అనే వార్తలు ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. చైనాలోని యూన్నాన్ ప్రావిన్స్ లో హంటా వైరస్ సోకిన ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడని చైనా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఓ సంచలన కథనాన్ని రాసింది. వున్నాన్ నుంచి షాండాంగ్ ప్రావిన్స్ కు బస్సులో బయలుదేరిన అతడు ప్రాణాలు వదిలాడట. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మరణంపై బెంబేలెత్తిపోయిన చైనా అధికారులు... బాధితుడు ప్రయాణించిన బస్సులో అతడితో కలిసి ప్రయాణించిన 32 మందికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారట. ఈ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వస్తే గానీ... హంటా వైరస్ కథేంటో గానీ పూర్తిగా తెలియదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటకే కరోనా ప్రబలిన వూహాన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వూహాన్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కరోనా... విశ్వవ్యాప్తంగా 187 దేశాలకు విస్తరించింది. ఇటలీ, ఫ్రాన్స్ సహా అగ్ర రాజ్యం అమెరికాలోనూ ఈ వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో పరిస్థితి దారుణాతిదారుణంగా ఉంది. ఇటలీతో పోల్చుకుంటే... మరణాలు తక్కువే అయినా ఫ్రాన్స్ లోనూ పరిస్థితి దారుణంగానే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలను పట్టిపీడిస్తున్న కరోనాను... కంట్రోల్ చేసే విషయంలో చైనా ఇప్పటికే విజయం సాధించినా.. ఇప్పుడు కొత్తగా హంటా వైరస్ కారణంగా ఆ దేశంలో ఓ వ్యక్తి చనిపోయాడన్న వార్తలు అటు చైనా ప్రజలతో పాటు ఇటు మిగిలిన ప్రపంచ దేశాల ప్రజలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పక తప్పదు.

అయితే కరోనాను కట్టడి చేసేందుకు యుద్ద ప్రాతిపదికన అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. అయినా కూడా కరోనాను కట్టడి చేయడంలో చాలా దేశాలు అంతగా సత్ఫలితాలు సాధించడం లేదు. ఫలితంగానే వందలు, వేలాది మంది ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా తరహాలోనూ హంటా వైరస్ కూడా పంజా విసిరితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. అయినా చైనాలో చనిపోయిన వ్యక్తం హంటా వైరస్ తోనే చనిపోయారా? అన్నది కూడా సందేహాస్పదంగానే ఉందన్న వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. కరోనా పుట్టిన దేశంలో ఇప్పుడు హంటా వైరస్ పేరిట మరో ప్రాణాంతక వైరస్ పుట్టిందన్న వార్తలు మాత్రం కలకలం రేపేవేనని చెప్పాలి. ఈ కొత్త వైరస్ కు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలు తెలిసేదాకా అసలు ఆ వైరస్ కు చెందిన భయాందోళనలు అనవసరమేనన్న వాదనలు కూడా లేకపోలేదు.


Tags:    

Similar News