అత‌డు వైట్‌ హౌస్ ఫెన్సింగ్ దూకేశాడు

Update: 2015-11-27 07:03 GMT
ఏ నిమిషాన ఎవ‌రు.. ఎలా దాడి చేస్తారో తెలీని ప‌రిస్థితి ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొంది. దీంతో ప్ర‌ముఖుల భ‌ద్ర‌తను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రపంచానికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించే అమెరికా అధ్య‌క్షుడి అధికార నివాస‌మైన వైట్ హౌస్ ద‌గ్గ‌ర ఎంత‌టి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉంటుంది? వ‌ంద‌లాదిగా సుశిక్షితులైన సిబ్బంది.. సీసీ కెమేరాలు.. అత్యాధునిక సాంకేతిక‌త‌.. డేగ‌క‌ళ్లు వేసుకొని చూసే డ్రోన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వైట్ హౌస్ ద‌గ్గ‌ర ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఉంటుంది. కానీ.. ఇంత‌టి ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న వైట్ హౌస్ ద‌గ్గ‌ర తాజాగా ఒక వ్య‌క్తి.. వైట్ హౌస్ ఫెన్సింగ్‌ ను దూకేయ‌టం తాజా క‌ల‌క‌లానికి కార‌ణ‌మైంది.

వైట్ హౌస్ ఫెన్సింగ్ ను దూకి లోప‌లికి వెళ్లే ప్ర‌య‌త్నించిన ఆగంత‌కుడితో వైట్‌ హౌస్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఒక్క‌సారి ఉలిక్కిప‌డింది. అత‌న్ని కొద్దిసేప‌టికే అదుపులోకి తీసుకున్న‌ప్ప‌టికి.. చాలానే హ‌డావుడి చోటు చేసుకుంది. ఎందుకంటే.. ఆ స‌మ‌యానికి వైట్ హౌస్ లోప‌ల అమెరికా అధ్య‌క్షుడు ఒబామా దంప‌తులు ఉన్నారు.

గురువారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న కాసేపు టెన్ష‌న్ పుట్టించింది. వెంట‌నే అత‌డ్ని అదుపులోకి తీసుకున్నారు. వైట్ హౌస్ ఫెన్సింగ్ ను దూకి లోప‌లికి ప్ర‌వేశించిన వ్య‌క్తిని జోసెఫ్ క్యాపుటోగా గుర్తించారు. ఇత‌గాడు.. ఇప్ప‌టికే ప‌లు నేరాలు చేసి జైలుకు వెళ్లిన చ‌రిత్ర ఉన్న‌వాడు కావ‌టం గ‌మ‌నార్హం. తాజా ఘ‌ట‌న నేప‌థ్యంలో వైట్ హౌస్‌ ను తాత్క‌లికంగా మూసేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఓప‌క్క ఐఎస్ తీవ్ర‌వాదులు వైట్ హౌస్ ను పేల్చేస్తామంటూ హెచ్చ‌రిస్తూ వీడియోలు విడుద‌ల చేస్తుంటే.. మ‌రోవైపు ఒక పాత నేర‌స్తుడు ఏకంగా వైట్ హౌస్ ఫెన్సింగ్ దూకి లోప‌ల‌కు ప్ర‌వేశించ‌టం చూస్తుంటే.. వైట్ హౌస్ ర‌క్షణ వ్య‌వ‌స్థను ఒక‌సారి క్రాస్ చెక్ చేయాల‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కాదంటారా?
Tags:    

Similar News