తల్లికి ఇన్సూరెన్స్ కట్టి మరీ చంపాడు

Update: 2019-07-27 05:19 GMT
మద్యం బానిసైతే ఎంతటి అనర్థాలు చోటుచేసుకుంటాయో తెలిపే సంఘటన ఇదీ.. కన్నతల్లిదండ్రులను కూడా చంపేసేంత కర్కషంగా ఆ కొడుకు తయారయ్యాడు. అప్పులు చేశాడు. అవి కుప్పలుగా తయారు కావడంతో తల్లిదండ్రులను వేధించాడు. వారే  నిరుపేదలు కావడంతో మాస్టర్ ప్లాన్ వేశారు. తల్లి  పేరిట ఇన్సూరెన్స్ పాలసీ  కట్టి ఆమెను చంపి ఆ డబ్బుతో జల్సాలు చేయాలనుకున్న కొడుకు వ్యవహారం తాజాగా  బట్టబయలు అయ్యింది.

ప్రకాశం జిల్లా దర్శిలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన కొడుకు కన్నతల్లిదండ్రులను అతి కిరాతకంగా హతమార్చాడు. దర్శి పట్టణానికి చెందిన అన్నపురెడ్డి వెంకటరెడ్డి (80), ఆయన భార్య ఆదెమ్మ(50)లు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. వీరి కుమారుడు అన్నపురెడ్డి నారాయణ రెడ్డి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ముద్ర అగ్రికల్చర్ సొసైటీలో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై ఊరు వాడ అప్పులు చేశాడు. అవి తీర్చమని తల్లిదండ్రులను వేధిస్తే ఉన్న ఆస్తిని అమ్మి తీర్చేశారు. అయితే తను పనిచేస్తున్న సొసైటీలో ఖాతాదారుల 3 లక్షలను సొంతానికి వాడుకొని వ్యసనాలకు ఖర్చు చేశాడు. అవి చెల్లించాలని సొసైటీ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. దీంతో తల్లిదండ్రులను అడిగినా వారు ఏవీ మిగల్లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.

మూడు నెలల క్రితం తన తల్లి పేరిట బజాజ్ అలియాంజ్ లో రూ.15 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. ఈనెల 21న రాత్రి మజ్జిగలో భారీగా నిద్రమాత్రలు వేసి తల్లిదండ్రులకు తాగించాడు. అయితే తెల్లవారు జాము వరకు వారిని గమనించిన నారాయణ రెడ్డి వారు చనిపోకపోవడంతో తల్లిని గొంతునులిమి చంపేశాడు. తండ్రి లేవగా ఆయన గొంతు , మణికట్టు కోసి కిరాతకంగా చంపాడు. ఇంట్లో డబ్బుల పెట్టేనె పగులకొట్టి చూసి లేకపోవడంతో  పారిపోయాడు.

దంపతుల జంట హత్యలపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు మృతుల కన్న కుమారుడే ఈ హత్య చేసినట్టు నిర్ధారించి శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇలా మద్యానికి బానిసై కన్న తల్లిదండ్రులనే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపిన వైనం కలకలం రేపింది.


Tags:    

Similar News