ఢిల్లీలో విద్యార్థుల ర్యాలీపై తుపాకీ కాల్పుల కలకలం

Update: 2020-01-30 13:21 GMT
ఊహించని పరిణామం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థుల సమూహం మీద గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్పులు జరిపిన వైనం సంచలనంగా మారింది. కాల్పుల కారణంగా ఒక విద్యార్థికి గాయాలు అయ్యాయి. వెంటనే అతడ్ని స్థానికంగా ఉన్న హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు.

కాల్పులు జరిపిన వ్యక్తి.. తాను చేయాలనుకున్న దాని మీద పక్కా అవగాహనతోనే కాల్పులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కొందరు విద్యార్థులు చేస్తున్న ర్యాలీకి అడ్డుగా వెళ్లిన అతడు.. కాల్పులు జరిపే ముందు.. అజాదీ ఎవరికి కావాలి? ఇదిగో.. అజాదీ అంటూ కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

దీంతో.. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి.. కాల్పులు జరిపిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతిలో ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతోనిరసన చేస్తున్న విద్యార్థులు విస్తుపోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు ఎవరు? ఎక్కడివాడు? అతడి వెనుక ఎవరున్నారు? లాంటి అంశాల మీద విచారణ జరుపుతున్నారు. కాల్పుల ఉదంతంతో ఉద్రిక్తత నెలకొన్నా.. సదరు ఆగంతకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో అక్కడ పరిస్థితి వెంటనే సద్దుమణిగినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కాల్పులు జరిపిన వ్యక్తి ఫేస్ బుక్ ఖాతాను పోలీసులు చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో సీఏఏ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.

Tags:    

Similar News