హన్మకొండ హారతి హత్య కేసుపై సంచలన నిజాలు

Update: 2020-01-12 03:34 GMT
ప్రేమించిన అమ్మాయి మీద అనుమానంతో దారుణంగా చంపేసిన వైనం క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. నమ్మకంగా రూంకు పిలిపించి.. కత్తితో గొంతు కోయటమే కాదు.. తర్వాత పోలీసులకు నేరుగా లొంగిపోయిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్ని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తాజాగా వెల్లడించారు.

తాను ప్రేమించిన హారతిని మహ్మద్ షాహిద్ ఎందుకు హత్య చేశారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి దారి తీసిన కారణాలు ఏమిటన్న వివరాల్ని మీడియాకు తెలియజేశారు. ఆయన ఏం చెప్పారన్నది సీపీ మాటల్లోనే చూస్తే..

హారతిని హత్య చేసిన మహ్మద్‌ షాహిద్‌ ఆలియాస్‌ చోటూ (24).. వరంగల్‌ జిల్లా కాజీపేట్‌ విష్ణుపురి ప్రాంతానికి చెందినవాడు. నిందితుడి మటన్‌ వ్యాపారం.  షాహిద్‌ 2016 హంటర్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. నిందితుడు డిగ్రీ చదివే సమయంలోనే అదే కళాశాలలో డిగ్రీ చదివే లష్కర్‌ సింగారం ప్రాంతానికి చెందిన హారతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరూ కొంతకాలం కలిసి తిరిగారు. ఈ నేపథ్యంలో హారతి ఇంటికి షాహిద్ పలుమార్లు వెళ్లి వచ్చేవాడు.

ఇటీవల డిగ్రీ పాస్ అయినా షాహిద్ ఆర్నెల్ల క్రితం బ్యాంక్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకునేందుకు హన్మకొండలోని రాంగనర్ ప్రాంతంంలో ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడకు కూడా హారతి అప్పుడప్పడు వచ్చి పోతుండేది. ఇలాంటి వేళ కొద్ది రోజుల క్రితం హారతికి శివనగర్‌ ప్రాంతానికి చెందిన సుకుమార్‌ అనే యువకుడితో పరిచయమైంది. తనతో గతంలో మాదిరి చనువుగా ఉండకపోవటంతో షాహిద్ అనుమానాన్ని పెంచుకున్నాడు. అయితే.. అతని అనుమానం నిజం కాదని తను తరచూ వివరణ ఇచ్చేది.

హత్య జరగటానికి రెండు రోజుల క్రితం సుకుమార్‌కు సెల్‌ఫోన్‌ ద్వారా హారతి మెసేజ్‌ లు పంపడాన్ని షాహిద్ గమనించాడు. దీనిపై గట్టిగా నిలదీయడంతో హారతి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో షాహిద్.. సుకుమార్‌ ఇంటి చిరునామా కనుక్కొని అతడి ఇంటికెళ్లి ప్రశ్నించాడు. తాను హారతిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఇదే విషయమై నిందితుడు షాహిద్‌ ఆమెను ప్రశ్నిస్తే.. తాను కూడా సుకుమార్‌ ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆగ్రహనికి గురైన నిందితుడు హరితను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

పక్కా ప్లాన్ తో  షాహిద్ శుక్రవారం ఉదయం హారతికి ఫోన్ ద్వారా మెసేజ్ చేశాడు. మధ్యాహ్నం కలుసుకుందామని చెప్పాడు. దీంతో హారతి శుక్రవారం మధ్యాహ్నం కలిసిన షాహిద్ బయట కాసేపు మాట్లాడి రూంకి తీసుకొచ్చాడు. ఇక్కడ వీరిద్దరికి మాటా మాటా పెరిగింది. తనను మర్చిపోవాలని.. తాను సుకుమార్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నమ్మకంగా నటించి హారతిని శారీరకంగా కలిసిన షాహిద్.. తర్వాత తన దగ్గరున్న కీఛైన్ కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం గదికి తాళం వేసి.. పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు. నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హారతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి.. ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. తమ కుమార్తెను చంపిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని హారతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News